సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అల్లర్లపై గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిక్‌చావ్ని ప్రాంతంలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని మాజీమంత్రి దానం నాగేందర్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌తో కలిసి గురువారం దానం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తనకు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకోవడంతోపాటు జరిగిన ఘటనపట్ల సానుభూతి వ్యక్తం చేశారని చెప్పారు.
మరోవైపు టీపీసీసీ కిసాన్- ఖేత్ మజ్దూర్ యూనియన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి గురువారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ను కలిసి తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరారు. విత్తనం కొరత లేకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.