
సాక్షి, హైదరాబాద్ : నేడు మెజారిటీ రంగాల్లో మన దేశం టాప్ 10లో ఉండటానికి ప్రజస్వామ్యమే కారణమన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌తో పాటు నాగిరెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిబియాలో అన్ని వనరులు, సంపద ఉన్నా.. ప్రజస్వామ్యం లేదని తెలిపారు. ఫలితంగా అక్కడ తిండి తినలేని దారుణ పరిస్థితులున్నాయన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోల్ అవుతుంటే.. జీహెచ్‌ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోల్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి జనాలు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు.
ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది : గవర్నర్
ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఓటరు హెల్ప్ లైన్ పోస్టర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం అభినందనీయమన్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. ఓటు వేయడానికని తెలిపారు.