
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ వినతి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అధికార కూటమి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని చెప్పింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలను సజావుగా నడిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులతో కూడిన వైఎస్సార్‌సీపీ బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
పిడుగురాళ్ల ఎన్నిక రద్దు చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ఉప ఎన్నికల్లో గెలవడానికి కూటమి నేతలు పోలీసు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెడుతున్నారని, ఇళ్లను కూల్చివేసి, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేసి, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.
తునిలో కూటమి పార్టీ ల వల్ల ఇప్పటికి రెండు దఫాలు వాయిదా పడిందని చెప్పారు. పాలకొండలో ఒకే ఒక్క ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు.
మాజీ మంత్రిపైనే దాడి చేస్తారా?: దేవినేని అవినాష్
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులను భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తునిలో ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపైనే దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయడం ఇది నాలుగోసారి అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అధికార పార్టీ ఆగడాలను, అప్రజాస్వామిక విధానాలను అధికారులు చేష్టలుడిగి చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అధికారవ్యవస్థలేవీ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే చలో తునికి పిలుపునిచ్చామన్నారు.
హద్దుల్లేకుండా దమనకాండ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
పాలకొండ, తుని, పిడుగురాళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment