కొత్త అధ్యాయం | AP High Court starts from today as Amaravati center | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యాయం

Published Tue, Jan 1 2019 4:24 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

AP High Court starts from today as Amaravati center - Sakshi

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

విజయవాడ లీగల్‌/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/ గరికపాడు (జగ్గయ్యపేట)/సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జనవరి 2వ తేదీ నుంచి హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్‌ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు.

ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్‌ ఏర్పాటు చేయమని సీఆర్‌డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. న్యాయమూర్తులు, అధికారుల వసతికోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను హైకోర్టు రిజిస్టార్‌ జనరల్‌(విజిలెన్స్‌) సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వై.లక్ష్మణరావు, హరిహరనాథ్‌ శర్మలు దగ్గరుండి చూశారు. హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్‌లకు నగరంలోని హోటల్‌ నోవాటెల్‌లో వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. ఇతర న్యాయశాఖ అధికారులకు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో బస కల్పించారు.

సోమవారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి విజయవాడకు తరలివెళ్తున్న ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులు 

న్యాయమూర్తులకు ఘన స్వాగతం..
రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టుకు కేటాయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర న్యాయమూర్తులందరూ సోమవారం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గాన విజయవాడకు చేరుకున్నారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, ప్రోటోకాల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీకాంత్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్, సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు నుంచి తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా నియమితులైన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ గౌరవ వందనం అందుకున్నారు. ప్రధాన న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబసభ్యులు ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ వచ్చారు.  

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కలసిన బీబీఏ ప్రతినిధులు
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఎస్‌.వి.నారాయణ బట్టి, జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ జి.శ్యామ్‌ప్రసాద్, జస్టిస్‌ జె.ఉమాదేవి, జస్టిస్‌ నక్కా బాలయోగి, జస్టిస్‌ టి.రజనీ, జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావులను బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) అధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణరావు, ఉపాధ్యక్షుడు కనిశెట్టి వెంకటరంగారావు, ప్రధాన కార్యదర్శి దొడ్ల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు మువ్వల జయప్రకాష్, ఎం.హనుమంత్, సి.హెచ్‌.రాధాకుమారి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్, బీబీఏ మాజీ అధ్యక్షులు చేకూరి శ్రీపతిరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, మట్టా జయకర్, సోము కృష్ణమూర్తి, చోడిశెట్టి మన్మథరావు తదితరులు హోటల్‌ నోవాటెల్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

నేడు నగరానికి రానున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ మంగవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. 

దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌ 
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి చైర్మన్‌ గౌరంగబాబు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

హైదరాబాద్‌ హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం
హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీకి చెందిన సిబ్బంది, న్యాయవాదులు సోమవారం విజయవాడకు పయనమైనప్పుడు హైదరాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో కలసిమెలసి పనిచేసిన న్యాయవాదులు, సిబ్బంది విడిపోతుండడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధాతప్త హృదయంతోనే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏపీ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులు వీడ్కోలు చెప్పారు. అనంతరం హైకోర్టు నుంచి ఐదు ప్రత్యేక బస్సులు బయల్దేరి సోమవారం రాత్రికి విజయవాడకు చేరాయి. కోర్టు రికార్డులను కూడా తీసుకొచ్చారు. ఆ ఫైళ్లను ఆయా కోర్టుల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement