సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. (కొత్త అధ్యాయం)
జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో సాగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్‌సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.
బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేయమని సీఆర్‌డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు.
జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మిగతా న్యాయమూర్తులు..
1. జస్టిస్ వెంకట నారాయణ భట్టి
2. జస్టిస్ వెంకట శేష సాయి
3. జస్టిస్ సీతారామ మూర్తి
4. జస్టిస్ దుర్గా ప్రసాద రావు
5. జస్టిస్ సునీల్ చౌదరి.
6. జస్టిస్ సత్యనారాయణ మూర్తి
7. జస్టిస్ శ్యాం ప్రసాద్
8. జస్టిస్ ఉమ దేవి
9. జస్టిస్ బాలయోగి
10. జస్టిస్ రజని
11. జస్టిస్ వెంకట సుబ్రమణ్య సోమయాజులు
12. జస్టిస్ విజయ లక్ష్మి
13. జస్టిస్ గంగా రావు
Comments
Please login to add a commentAdd a comment