
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవిషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనందున ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియను వా యిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రవీణ్ చతుర్వేది వాదిస్తూ.. ఏపీ హైకోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పన డిసెంబర్ 15 నాటికి పూర్తి చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని చెప్పారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకొని.. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టుల కార్యకలాపాలు ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఆరంభంలో చిన్నచిన్న సమస్యలు సాధారణంగానే ఉంటాయని వ్యాఖ్యానించి కేసును విచారించేందుకు తిరస్కరించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్లు కోరగా కోర్టు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment