హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ జనవరి ఒకటో తేదీ, ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించనున్న మిగిలిన 13 మంది ఆ రోజే ప్రమాణం చేయనున్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కూడా జనవరి ఒకటినే ప్రమాణం చేయనున్నారు. ఆయనతో రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించి అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ వస్తారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను శుక్రవారం హైకోర్టులో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కలిసి అభినందించారు.
న్యాయమూర్తులకు ‘నోవాటెల్’లో బస
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు విజయవాడలోని నోవాటెల్‌లో తాత్కాలిక బస కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్‌లకు సైతం అక్కడే బస ఏర్పాటు చేశారు. ఇతర న్యాయాధికారులకు ప్రభుత్వ అతిథి గృహం/హోటళ్లలో బస ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టు ఉద్యోగులు, సిబ్బంది గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. న్యాయమూర్తులకు ఏడాది పాటు అద్దె ప్రాతిపదికన 12 విల్లాలను సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
సీఎం క్యాంప్ ఆఫీస్‌లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, కోర్టు సిబ్బంది పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏపీఏటీకి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేయాలని దాని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. అలాగే ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. గవర్నర్ వచ్చేందుకు వీలుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని ఏవియేషన్ ఎండీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment