joint high court division
-
1న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ జనవరి ఒకటో తేదీ, ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించనున్న మిగిలిన 13 మంది ఆ రోజే ప్రమాణం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కూడా జనవరి ఒకటినే ప్రమాణం చేయనున్నారు. ఆయనతో రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించి అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ వస్తారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను శుక్రవారం హైకోర్టులో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కలిసి అభినందించారు. న్యాయమూర్తులకు ‘నోవాటెల్’లో బస ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు విజయవాడలోని నోవాటెల్‌లో తాత్కాలిక బస కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్లకు సైతం అక్కడే బస ఏర్పాటు చేశారు. ఇతర న్యాయాధికారులకు ప్రభుత్వ అతిథి గృహం/హోటళ్లలో బస ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టు ఉద్యోగులు, సిబ్బంది గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. న్యాయమూర్తులకు ఏడాది పాటు అద్దె ప్రాతిపదికన 12 విల్లాలను సిద్ధం చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏపీఏటీకి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేయాలని దాని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. అలాగే ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. గవర్నర్ వచ్చేందుకు వీలుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని ఏవియేషన్ ఎండీని ఆదేశించింది. -
డిసెంబర్ 15 తర్వాత హైకోర్టు విభజనకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు డిసెంబరు 15 తరువాత నోటిఫికేషన్ ఇచ్చేలా తాము ఆదేశాలు జారీచేస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ దాఖలు చేసిన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం మరో సారి ధర్మాసనం వాదనలు వింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీ మన్ వాదనలు వినిపిస్తూ.. ‘డిసెంబర్ 15లోగా హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతుంది. న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణం 2019 ఆగస్టుకు పూర్తవుతుంది’అని నివేదించారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘డిసెంబర్ 15లోగా భవనం సిద్ధ మైతే ఆ వెంటనే కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేయండి. ఆ తదుపరి మూడు నాలుగు నెలల్లో విభజన పూర్తయ్యేందుకు వీలవుతుంది’అని కోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కూడా దీంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ.. సాధ్యమైనంత త్వరగా విభజన పూర్తయితే మంచిదన్నారు. లేదంటే న్యాయమూర్తుల నియామకం, కేటాయింపు ఇత్యాది అంశాల్లో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. మంగళవారం ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ శరత్‌కుమార్ వివరాలు వెల్లడించారు. -
విస్తృత ధర్మాసనానికి హైకోర్టు విభజన తీర్పు
రెండు ప్రశ్నలను లేవనెత్తిన ద్విసభ్య ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను హైకోర్టు గురువారం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఈ సందర్భంగా ధర్మాసనం రెండు ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 31 (2) కింద రాష్ట్రపతికున్న అధికారాలను నియంత్రించేలా గత తీర్పు ఉందా? ఇందుకు సంబంధించి ఆ తీర్పులో లోపాలున్నాయా? ఇక.. 2014, 1956 విభజన చట్టాల్లోని పదజాలం పరస్పర భిన్నంగా ఉన్న నేపథ్యంలో అసలు హైకోర్టు ‘ప్రధాన కేంద్రం’ అంటే అర్థం ఏమిటి? అన్న ఈ ప్రశ్నలను విస్తృత ధర్మాసనం ముందుంచింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగినా కూడా హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే ఉండాలని తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టును తెలంగాణ భూభాగంపై ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదంది. అయితే ఈ తీర్పు ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో రాష్ట్రపతి అధికారాలను నియంత్రించేలా ఉందని, అందువల్ల దానిని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవీందర్‌రెడ్డి అనే న్యాయవాది వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని తీర్పును వాయిదా వేసి గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ‘రివ్యూ పిటిషన్లలో లేవనెత్తిన అంశాల్లో విస్తృత ప్రయోజనాలున్నాయి. 2014 పునర్విభజన చట్టాన్ని అనుసరించి ప్రధాన పిటిషన్లలో ఉభయ పక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాటిని అప్పటి ధర్మాసనం తన ప్రధాన తీర్పులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనం విచారించడమే మేలని మేం అభిప్రాయపడుతున్నాం’ అని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు కాపీని విస్తృత ధర్మాసనం ఏర్పాటు నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
'సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే అది చారిత్రక తప్పిదమవుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ హైకోర్టును ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై చర్చ జరుగుతోందని అన్నారు. మంగళవారం ఇందిరాభవన్‌లో ఆయన మాట్లాడారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే, భవిష్యత్‌లో మరొక విభజనోధ్యమానికి ఇప్పుడే బీజం వేసినట్లవుతుందని హెచ్చరించారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు రెండు కళ్లు లాంటివి' అని చెప్పారు. ఇందులో ఒకదానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రెండవదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని 1937 లోనే శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. ఆ ఒడింబడిక ప్రకారమే 1953లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు రాయలసీమలోని కర్నూలు రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడమయిందని గుర్తు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాలలో ఉండటం గమనార్హం. యూపీ రాజధాని లక్నో కాగా, హైకోర్టు అలహాబాద్‌లో ఉందని, అదేవిధంగా కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయన్నారు. అందుకే రాయలసీమలోనూ ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి పునరుద్ఘాటించారు.