
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు డిసెంబరు 15 తరువాత నోటిఫికేషన్ ఇచ్చేలా తాము ఆదేశాలు జారీచేస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ దాఖలు చేసిన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం మరో సారి ధర్మాసనం వాదనలు వింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీ మన్ వాదనలు వినిపిస్తూ.. ‘డిసెంబర్ 15లోగా హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతుంది. న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణం 2019 ఆగస్టుకు పూర్తవుతుంది’అని నివేదించారు.
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘డిసెంబర్ 15లోగా భవనం సిద్ధ మైతే ఆ వెంటనే కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేయండి. ఆ తదుపరి మూడు నాలుగు నెలల్లో విభజన పూర్తయ్యేందుకు వీలవుతుంది’అని కోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కూడా దీంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ.. సాధ్యమైనంత త్వరగా విభజన పూర్తయితే మంచిదన్నారు. లేదంటే న్యాయమూర్తుల నియామకం, కేటాయింపు ఇత్యాది అంశాల్లో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. మంగళవారం ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ శరత్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment