సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి.
ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment