jalagam venkatrao
-
‘కొత్తగూడెం’ తీర్పుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
మరో ‘గని’హారం!
సాక్షి, కొత్తగూడెం: మన్యానికి ముఖద్వారంగా ఉన్న కొత్తగూడెం సిగలో మరో మణిహారం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే బొగ్గు గనులతో విలసిల్లుతుండడంతో పాటు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ఇక్కడ ఇప్పటికే సింగరేణి కేంద్ర కార్యాల యం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింతగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మూడేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారీ స్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందు, ఆసియాలోనే అతిపెద్ద మణుగూరు ఉపరితల గని, బొగ్గు అధారితమైన పాల్వంచ కేటీపీఎస్, అశ్వాపురం భారజల కర్మాగారం, ఐటీసీ ఉన్నాయి. ఈ క్రమంలో 400 ఎకరాలకు పైగా భూమి ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను ధన్‌బాద్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ లేదా మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. పలుసార్లు కొత్తగూడెం ఏరియాకు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్ 26న చివరిసారిగా పర్యటించింది. అనంతరం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ‘మైనర్ అండ్ టెక్నలాజికల్ డీమ్డ్ యూనివర్సిటీ’గా చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని కమిటీ సూచనలు చేసింది. పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఏజెన్సీ కావడంతో ఇక్కడ మైనింగ్ డీమ్డ్ వర్సిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే జలగం తీవ్ర కృషి చేస్తున్నారు. కొత్తగూడెంలో మైనింగ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రతిపాదన ఉంది. మొదట మైనింగ్ కళాశాలగా ఏర్పాటైన దీంట్లో తర్వాత వివిధ ఇతర ఇంజినీరింగ్ కోర్సులు వచ్చాయి. అనంతర కాలంలో యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం దీనిని సాకారం చేయాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా కొత్తగూడెం, పాల్వంచల్లో రెండుచోట్ల ఆటోనగర్లను మంజూరు చేయించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మైనింగ్ వర్సిటీపై జలగం చర్చకు తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. అయితే ప్రస్తుత సెషన్లోనే దీనిపై ప్రకటన చేయించే దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే చర్చకు కొత్తగూడెంలో మైనింగ్ యూని వర్సిటీ ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చి ప్రకటన చేయించేందుకు కృషి చేస్తున్నాం. –జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే -
ముహూర్తం ఖరారు
జలగంకు సహాయ మంత్రి హోదాతో పార్లమెంటరీ సెక్రటరీ పదవి కేబినెట్లో కీలకం కానున్న ఖమ్మం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు మంత్రివర్గంలో టీఆర్ఎస్ నేత తుమ్మలకు చాన్స్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆరు నెలల పాటు ఎదురుచూసిన జిల్లా ప్రజల కల ఎట్టకేలకు సాకారం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లభించడం ఖాయమైంది. అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి నోచుకోని జిల్లాల్లో ఒకటైన ఖమ్మానికి ఆలోటు తీరనుంది. జిల్లానుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం దక్కడం దాదాపు ఖాయమైంది. అలాగే టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావుకు సైతం సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాకు మంత్రి వర్గంలో స్థానం లేకపోవడంతో పాలనా పరంగా, పార్టీ పరంగా కొంత నిస్తేజం అలుముకుంది. అయితే ఈ మూడు నెలల్లోనే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలో అగ్రనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో గత సెప్టెంబర్‌లో తన అనుచరులతో టీఆర్ఎస్లోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ అదృష్ట సంఖ్యలుగా భావించే 6, 15, 24 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతినెలా ఎదురుచూశాయి. మంత్రివర్గంలో ఒక్కరికే ప్రాతినిధ్యం లభిస్తుందని మొదటి నుంచి అనుకుంటున్నా అనూహ్యంగా సహాయ మంత్రి హోదా కలిగిన మరో పదవిని సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావుకు కేటాయిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రస్థాయిలో పరిమితంగా భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ మన జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నేత, గార్ల నివాసి పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారని టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఇద్దరికి సహాయ మంత్రి హోదా కలిగిన కేబినెట్ కార్యదర్శి పదవులను అప్పగించారు. ఆ తర్వాత అలాంటి సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వంలోనూ కొనసాగలేదు. మళ్లీ కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీ పదవులను అప్పగించడంతో 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సహాయ మంత్రుల హోదా కలిగిన ఈ పదవులు రానున్నాయి. ఇందులో ఒకటి జలగం వెంకట్రావును వరిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 16న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆనందంతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ మంత్రి వర్గంలో కీలకశాఖ వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు హోం, ఆర్అండ్బీ, విద్యుత్ వంటి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆనంద పడుతున్నాయి. 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల 1985లో తొలిసారిగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో చిన్ననీటి పారుదలశాఖా మంత్రిగా తొలి బాధ్యతలు నెరవేర్చారు. కొంతకాలం వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్‌గా సైతం పనిచేశారు. 1989లో ఓటమి చవిచూసిన తుమ్మల 94, 99లో తిరిగి సత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోనూ కీలకమైన భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహించారు. 2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన తుమ్మల అప్పుడు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావుపై విజయం సాధించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తుమ్మల మళ్లీ మంత్రి అవుతున్నారు. తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం లభించడం, జలగం వెంకట్రావుకు సహాయమంత్రి హోదా కలిగిన పదవి లభిస్తుండటంతో జిల్లా రాజకీయాలు మరింత వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనపడుతోంది. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీమంత్రి తుమ్మలపై విజయం సాధించారు. అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఖమ్మం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతర పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య మూడుకు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు రాజకీయంగా అధికార పార్టీలో నెలకొన్న కొంత స్తబ్ధత మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలగనుంది. అలాగే పాలనా వ్యవహారాల్లోనూ జిల్లాకు అధికార పార్టీ ముద్ర పెద్దగా కనిపించకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో కష్టించి పనిచేసిన వారిలో, టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడు కేబినెట్లో చోటు లభించడం ఖాయం కావడంతో అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
తుమ్మల, జలగం భేటీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదని మరోమారు రుజువైంది. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు కుమారుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా గంటపాటు చర్చలు జరపడం జిల్లాలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. టీఆర్ఎస్లో చేరడానికి ముందు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మలను జలగం పరామర్శించడం... ఆ తర్వాత ఆయన పార్టీలో చేరే కార్యక్రమానికి కూడా హాజరుకావడం విదితమే. ఈ నేపథ్యంలో తుమ్మల కూడా తన రాజకీయ చతురతతో జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు, టీఆర్ఎస్లో పనిచేస్తున్న వారితో పాటు జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా కలిసి అందరం కలిసి పనిచేయాలని చర్చిస్తున్నారు. తన చేరిక సభలో జిల్లాలో అందరూ తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని అధినేత కేసీఆర్ సూచించిన నేపథ్యంలో తన నాయకత్వానికి ఆటంకాలు లేకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహితులు చెపుతున్నారు. జలగంతో భేటీకి ముందు తుమ్మల హైదరాబాద్‌లోని తన నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌తో కూడా సమావేశమయ్యారు. ఆయనతో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇక, జలగంతో భేటీ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం ఎలా చేయాలి? జిల్లా పార్టీలో ఎలాంటి గ్రూపులు లే కుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మొత్తం మీద నిన్నటివరకు వైరివర్గాలుగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు క్రమంగా ఒకటవుతున్న పరిస్థితులు కనిపించడం, తుమ్మలను జలగం పరామర్శించడం, ఆ తర్వాత తుమ్మలే నేరుగా జలగం నివాసానికి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించనుందని రాజకీయ వర్గాలంటున్నాయి. -
గులాబీ తీర్థం..
కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత సహా 12 మంది కౌన్సిలర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యంలో వీరిని రాష్ట్ర నీటి పారుదల, గనుల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాస గృహంలో ఆదివారం ఈ చేర్పింపుల కార్యక్రమంగా జరిగింది. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పారు. వీరిలో ఎక్కుమంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో చైర్పర్సన్ పులి గీతతో పాటు కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, గోబ్రియానాయక్, పల్లపు రాజు, మామిడి శ్రీనివాస్, కనుకుంట్ల పార్వతి, సబిత, గుమ్మడెల్లి పుష్పలత, పద్మావతి, స్వతంత్ర కౌన్సిలర్ షేక్ సుల్తాన ఉన్నారు. సీపీఐకి చెందిన వై.శ్రీను, కనుకుంట్ల కుమార్‌లు సాధారణ ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్లో చేరారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 33 వార్డులకు టీఆర్ఎస్ బలం 14కి చేరింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ మోరె భాస్కర్, నాయకులు పులి రాజశేఖర్, తీగల వెంకన్న, రమేష్, గుమ్మడెల్లి రమణ తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో మొత్తం ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలుత రెండు స్థానాలకు, ఆ తర్వాత మరో ఆరు స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఒంటరి పోరుకు సిద్ధమైన టీఆర్ఎస్ తొలి జాబితాలో జిల్లాలోని కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, సత్తుపల్లి నుంచి పిడమర్తి రవికి చోటు కల్పించింది. మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో మరో అరుగురి పేర్లు ప్రకటించింది. సీపీఐ నుంచి టీఆర్ఎస్లో చేరిన బాణోత్ చంద్రావతికి అనుకున్నట్లుగానే వైరా స్థానం ఖరారైంది. ఆమె ఖమ్మం, వైరా నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవడంతో ఎక్కడ నుంచి టికెట్ ఆశిస్తారోనని చర్చకు దారి తీసింది. చివరకు ఆమె కోరిక ప్రకారం పార్టీ అధినేత కేసీఆర్ వైరా స్థానం ఇచ్చారు. అలాగే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పట్టణానికి చెందిన ఎస్బీ బేగ్‌ను ప్రకటించారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి విద్యావేత్తగుండాల క్రిష్ణ, మధిరకు బొమ్మెర రాంమూర్తి, అశ్వారావుపేట నుంచి జె.ఆదినారాయణ, పినపాకకు డాక్టర్ శంకర్‌నాయక్, భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఝాన్సీరాణి పేర్లను ప్రకటించారు. మహహూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీతారాంనాయక్‌కు కేటాయించారు. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తొలుత పార్టీ నేత ఎస్బీ బేగ్ ఆశించారు. అయితే స్థానిక విద్యావేత్త గుండాల క్రిష్ణ (ఆర్జేసీ) పార్టీలో చేరడంతో ఖమ్మం టికెట్ ఆయనకు కేటాయించి, బేగ్‌ను పార్లమెంట్ బరిలోకి దించారు. ఇల్లెందు, పాలేరుకు ఆశావహులు.. నామినేషన్‌కు ఇక ఒకరోజే గడువు ఉండడంతో ఇల్లెందు, పాలేరు స్థానం కోసం చాలా మంది ఆశావహులు రాజధానిలో మకాం వేశారు. ఈ సీట్ల విషయంలో నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు టికెట్ ఆశిస్తున్నా... జిల్లాలో పట్టున్న నేతలను బరిలోకి దించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అసలు ఈ రెండు స్థానాలు ఎవరికి కేటాయిస్తారోనని మంగళవారం ఆపార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. చివరకు జలగం చెప్పిన వారికే ఈ రెండు స్థానాలు కేటాయిస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.