తుమ్మల, జలగం భేటీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదని మరోమారు రుజువైంది. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు కుమారుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా గంటపాటు చర్చలు జరపడం జిల్లాలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది.
టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మలను జలగం పరామర్శించడం... ఆ తర్వాత ఆయన పార్టీలో చేరే కార్యక్రమానికి కూడా హాజరుకావడం విదితమే. ఈ నేపథ్యంలో తుమ్మల కూడా తన రాజకీయ చతురతతో జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే పనిలో పడ్డారు.
అందులో భాగంగా తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు, టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న వారితో పాటు జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా కలిసి అందరం కలిసి పనిచేయాలని చర్చిస్తున్నారు. తన చేరిక సభలో జిల్లాలో అందరూ తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని అధినేత కేసీఆర్ సూచించిన నేపథ్యంలో తన నాయకత్వానికి ఆటంకాలు లేకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహితులు చెపుతున్నారు.
జలగంతో భేటీకి ముందు తుమ్మల హైదరాబాద్‌లోని తన నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌తో కూడా సమావేశమయ్యారు. ఆయనతో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇక, జలగంతో భేటీ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం ఎలా చేయాలి? జిల్లా పార్టీలో ఎలాంటి గ్రూపులు లే కుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
మొత్తం మీద నిన్నటివరకు వైరివర్గాలుగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు క్రమంగా ఒకటవుతున్న పరిస్థితులు కనిపించడం, తుమ్మలను జలగం పరామర్శించడం, ఆ తర్వాత తుమ్మలే నేరుగా జలగం నివాసానికి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించనుందని రాజకీయ వర్గాలంటున్నాయి.