కొత్తగూడెం కాలేజ్ ఆఫ్ మైనింగ్
సాక్షి, కొత్తగూడెం: మన్యానికి ముఖద్వారంగా ఉన్న కొత్తగూడెం సిగలో మరో మణిహారం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే బొగ్గు గనులతో విలసిల్లుతుండడంతో పాటు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ఇక్కడ ఇప్పటికే సింగరేణి కేంద్ర కార్యాల యం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింతగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మూడేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు.
భారీ స్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందు, ఆసియాలోనే అతిపెద్ద మణుగూరు ఉపరితల గని, బొగ్గు అధారితమైన పాల్వంచ కేటీపీఎస్, అశ్వాపురం భారజల కర్మాగారం, ఐటీసీ ఉన్నాయి. ఈ క్రమంలో 400 ఎకరాలకు పైగా భూమి ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను ధన్‌బాద్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ లేదా మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. పలుసార్లు కొత్తగూడెం ఏరియాకు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్ 26న చివరిసారిగా పర్యటించింది.
అనంతరం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ‘మైనర్ అండ్ టెక్నలాజికల్ డీమ్డ్ యూనివర్సిటీ’గా చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని కమిటీ సూచనలు చేసింది. పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఏజెన్సీ కావడంతో ఇక్కడ మైనింగ్ డీమ్డ్ వర్సిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే జలగం తీవ్ర కృషి చేస్తున్నారు. కొత్తగూడెంలో మైనింగ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రతిపాదన ఉంది. మొదట మైనింగ్ కళాశాలగా ఏర్పాటైన దీంట్లో తర్వాత వివిధ ఇతర ఇంజినీరింగ్ కోర్సులు వచ్చాయి. అనంతర కాలంలో యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి.
ప్రస్తుతం దీనిని సాకారం చేయాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా కొత్తగూడెం, పాల్వంచల్లో రెండుచోట్ల ఆటోనగర్‌లను మంజూరు చేయించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మైనింగ్ వర్సిటీపై జలగం చర్చకు తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. అయితే ప్రస్తుత సెషన్‌లోనే దీనిపై ప్రకటన చేయించే దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమావేశాల్లోనే చర్చకు
కొత్తగూడెంలో మైనింగ్ యూని వర్సిటీ ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చి ప్రకటన చేయించేందుకు కృషి చేస్తున్నాం.
–జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment