
కొత్తగూడెం రూరల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారితప్పాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతవర్ర గామ ప్రభుత్వ పాఠశాలలో దొడ్డ సునీల్‌కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన గత ఏడాది డిసెంబర్‌లో పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను పాఠశాలకు పిలిచేవాడు. ఆయన మాటలు నమ్మి వచ్చిన ఐదుగురు విద్యార్థినుల(మైనర్లు)పై సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సునీల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఐపీఎస్ అధికారి వినీత్ విచారణ జరిపారు. ఈ మేరకు కేసు కోర్టు విచారణకు రాగా, న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. అనంతరం నిందితుడు సునీల్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment