సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా తమకూ ప్రతిష్టాత్మకమైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఏమౌతుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలున్నందునే రీపోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, దీనిపై ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పారదర్శకతను చాటుకోవాల్సిన అవసరం ఉందంది.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాల వ్యవహారంపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని తేల్చిచెప్పింది. తొలుత ధర్మాసనం ఢిల్లీ వైద్యుల బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులు జారీ చేయబోతుంటే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం వరకూ గడువు ఇవ్వాలని ఏజీ కోరగా.. శనివారం ప్రత్యేకంగా ఈ కేసును మాత్రమే విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది.
రీ పోస్టుమార్టం చేయాల్సిందే..
ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే పిల్‌ను ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. కె.సజన ఇతరుల కేసులో ఈనెల 17న సుప్రీంకోర్టు.. సాక్ష్యాధారాల సేకరణ–మృతదేహాల అప్పగింత వ్యవహారాలపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇందుకు అనుగుణంగా మృతదేహాలకు వేరే రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని పిల్‌లో కోర్టుకు సహాయకారిగా (ఎమికస్‌క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోరారు.
వెంటనే అందుకు అనుగుణంగా ధర్మాసనం స్పందించబోతుంటే ఏజీ కల్పించుకుని.. తెలంగాణలో నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్య నిపుణులున్నారని, వేరే రాష్ట్రాల వైద్యులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మృతదేహాలు పాడైపోతున్నాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు కూడా చెబుతున్నారని, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని, ఎన్‌కౌంటర్ పేరుతో నలుగురిని కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రీపోస్టుమార్టం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్‌లో రీపోస్టుమార్టం కావాలని పిటిషనర్ కోరలేదని ఏజీ చెప్పగా, ఒక పిల్‌లో లేకపోతే మరో పిల్‌లో ఆ అభ్యర్థన ఉందని, అయినా సుప్రీంకోర్టు తమను నిర్ణయించాలని చెప్పాక ఆకాశమే హద్దుగా చేసుకుని ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఎన్‌కౌంటర్ విశ్వవ్యాప్తమైంది
పోలీసుల ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్టలే కాకుండా తెలంగాణ హైకోర్టు ప్రతిష్ట కూడా ఇందులో ముడిపడి ఉందని, దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ విశ్వవ్యాప్తమైందని, ఏం జరగబోతోందోనని దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బూటకపు ఎన్‌కౌంటర్ అనే విమర్శలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలని, అయితే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందో అర్థం కావడం లేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు దిశ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్టే ఉత్తర్వులు ఇచ్చిందని ఏజీ చెప్పగానే ధర్మాసనం తిరిగి స్పందిస్తూ ఆ తర్వాత మృతదేహాల వ్యవహారాన్ని హైకోర్టే తేల్చాలని తమకు ఆదేశాలిచ్చిందని గుర్తు చేసింది. బంతి మా కోర్టులో ఉందని వ్యాఖ్యానించింది. ఒక ఘటన (ఎన్‌కౌంటర్) జరిగాక పోస్టుమార్టం జరిగిందని, మళ్లీ పోస్టుమార్టం చేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ (చర్యకు కారణం) ఉండాలి కదా అని ఏజీ సందేహాన్ని లేవనెత్తారు.
తాము ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆదేమీ అడ్డంకి కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలకు కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేయాలని, ఎంతకాలం వాటిని భద్రపర్చుతారని, ఈ ఘటనపై ఆధారాల సేకరణకు వీలుగా మరోసారి వాటికి పోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులను ప్రభుత్వం విభేదిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. అయితే రీపోస్టుమార్టం చేయాలనే పిల్‌పై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సోమవారం వరకూ సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరిని తెలుసుకునేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో సెలవు దినమైనా శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేకంగా విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment