![Two Petitions Filed On Disha Accused Encounter In High Court - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/9/disha-case2.jpg.webp?itok=Ev5mHr8Q)
సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను నేడు (సోమవారం) మధ్యాహ్నాం 2:30 గంటలకు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ముందుగా ప్రకటించిన మేరకు నేడు ఉదయమే విచారణ జరపాల్సి ఉన్నా.. ఎన్‌కౌంటర్‌పై మరో పటిషన్ దాఖలు కావడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లు కలిపి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపారని మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. భూటకపు ఎన్‌కౌంటర్‌గా ప్రకటించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో నేడు హైకోర్టు జరిపే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని హైకోర్టు ఇదివరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో మృతదేహాలను ఉంచారు.
విచారణకు సుప్రీం అంగీకారం..
దిశ నిందతుల ఎన్‌కౌంటర్ సెగలు సుప్రీంకోర్టును తాకాయి. దిశ హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జి.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్లో కోరారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలుచేయాల్సిందిగా ఆదేశించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిందేకు న్యాయస్థానం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment