'సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే అది చారిత్రక తప్పిదమవుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ హైకోర్టును ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై చర్చ జరుగుతోందని అన్నారు. మంగళవారం ఇందిరాభవన్లో ఆయన మాట్లాడారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే, భవిష్యత్లో మరొక విభజనోధ్యమానికి ఇప్పుడే బీజం వేసినట్లవుతుందని హెచ్చరించారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు రెండు కళ్లు లాంటివి' అని చెప్పారు. ఇందులో ఒకదానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రెండవదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని 1937 లోనే శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగిందని గుర్తుచేశారు.
ఆ ఒడింబడిక ప్రకారమే 1953లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు రాయలసీమలోని కర్నూలు రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడమయిందని గుర్తు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాలలో ఉండటం గమనార్హం. యూపీ రాజధాని లక్నో కాగా, హైకోర్టు అలహాబాద్లో ఉందని, అదేవిధంగా కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయన్నారు. అందుకే రాయలసీమలోనూ ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి పునరుద్ఘాటించారు.