TulasiReddy
-
దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు : తులసిరెడ్డి
వేంపల్లె : ప్రధానమంత్రి మోదీ తొందరపాటు నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏటీఎంలు ఏనీ టైం మూతవేసే మిషన్లుగా.. దిష్టిబొమ్మల్లా తయారయ్యాయని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వేంపల్లెలోని పలు ఏటీఎంలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఒక్క ఏటీఎంలో కూడా నగదు లేకపోవడంతో డబ్బుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును, బీజేపీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. -
'అది తెలుగు దద్దమ్మల పార్టీ'
మంత్రాలయం: తెలుగుదేశం పేరుతో ప్రస్తుతం మనుగడలోఉన్న పార్టీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని ఆయన విమర్శించారు. కపటనాటకాలతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్నదంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఎస్వీబీ అతిథిగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన తులసిరెడ్డి.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 108వ సెక్షన్ అమలు వంటి కీలక అంశాలు పొందుపర్చారని, ఈ మూడు సూత్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయనందునే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామన్న కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో నిజంలేదని, ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడా సూచించలేదని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని అన్నారు. -
‘ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టండి’
ప్రత్యేక హోదా విషయంలో ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి టీడీపీ, కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇందిర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక గంటలోపే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నేడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్రమోదీ వద్ద తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అమలు చేయించడంలో ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
'సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే అది చారిత్రక తప్పిదమవుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ హైకోర్టును ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై చర్చ జరుగుతోందని అన్నారు. మంగళవారం ఇందిరాభవన్‌లో ఆయన మాట్లాడారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే, భవిష్యత్‌లో మరొక విభజనోధ్యమానికి ఇప్పుడే బీజం వేసినట్లవుతుందని హెచ్చరించారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు రెండు కళ్లు లాంటివి' అని చెప్పారు. ఇందులో ఒకదానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రెండవదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని 1937 లోనే శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. ఆ ఒడింబడిక ప్రకారమే 1953లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు రాయలసీమలోని కర్నూలు రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడమయిందని గుర్తు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాలలో ఉండటం గమనార్హం. యూపీ రాజధాని లక్నో కాగా, హైకోర్టు అలహాబాద్‌లో ఉందని, అదేవిధంగా కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయన్నారు. అందుకే రాయలసీమలోనూ ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి పునరుద్ఘాటించారు. -
'సతీసావిత్రికి-చింతామణికీ ఉన్నంత తేడా'
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి .. ఎన్టీఆర్ కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లె లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ శాసన సభ్యులుగా గెలిచిన రత్తయ్య, నారాయణ, ఆదయ్యలు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే.. ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలసలను ప్రోత్సహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిరంతరం ఎన్టీఆర్ పేరును దొంగ జపం చేసే టీడీపీ నాయకులు పార్టీఫిరాయింపుల విషయంలో సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించి టీడీపీలోకి చేర్చుకున్నట్లైతే బాబు రాజనీతిజ్ఞుడు అవుతాడని లేకదంటే... చరిత్ర హీనుడవుతాడని అన్నారు. పార్టీఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.