సదస్సులో ప్రసంగిస్తున్న హైకోర్టు ఏసీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్
చంద్రగిరి రూరల్ (చిత్తూరు జిల్లా): దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ అంశాలు కీలకమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఉన్న ఓ హోటల్‌ల్లో జాతీయ ట్యాక్స్ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తొలిరోజు జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ఉండటం ప్రధానం అన్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్‌పై అధ్యయనం నిరంతర ప్రక్రియ అని, అవగాహన కల్పనలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రముఖ పాత్ర పోషించడం అభినందనీయమని చెప్పారు.
పన్నుల వల్ల సామాజికాభివృద్ధి, సామాజిక న్యాయం అందుతాయని చెప్పారు. పన్నుల పాలసీపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. పన్నుల మినహాయింపు కూడా దేశాభివృద్ధిలో భాగమేనని చెప్పారు. పన్నుల చెల్లింపులో ఉన్న సాధక బాధకాలను పారదర్శకతతో చర్చించి కేంద్రానికి సమర్పించగలిగితే నూతన విధానాలకు అవకాశం కలుగుతుందన్నారు. నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అవగాహన సదస్సులు అమరావతిలో చేపట్టాలని, ఇలాంటి వాటి వల్ల న్యాయవాదులకు, ఆడిటర్లకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ సూచనపై ఏపీ ఫెడరేషన్ స్పందించి.. త్వరలో అమరావతిలో సదస్సు నిర్వహణకు అంగీకారం తెలిపింది.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గంగారావు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా ట్యాక్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ష్రాఫ్, జనరల్ సెక్రటరీ ఆనంద్ పాసారి, సౌత్‌జోన్ చైర్మన్ సీతాపతిరావు, సెక్రటరి సంజీవరావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కృష్ణ మోహన్‌తో పాటు జిల్లాలోని పలువురు ఆడిటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలి
ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. జాతీయ ట్యాక్స్ సదస్సుకు ఆయన సాయత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నుల సేకరణలో ప్రాక్టీషనర్ల కృషి అభినందనీయమని, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలు సీఎం తనకు అప్పగించడం సంతోషమన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష పన్నుల వసూల్లో జీఎస్‌టీ కీలకపాత్ర అని, చిన్న, సన్నకారు వ్యాపారస్థులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే వారికి బ్యాంకు రుణాలు మరింత సులభతరం అవుతుందన్నారు. అనంతరం 40 ఏళ్లకు పైగా సేవలందించిన ట్యాక్స్ ప్రాక్టీషనర్లు మహబూబ్ బాషా, నాగభూషణం, మోహన్ రాజు గుప్తా, ఫాల్గుణ కుమార్, రాజారెడ్డి, రామకృష్ణలను ఆయన ఘనంగా సత్కరించారు. సదస్సులో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సావనీర్‌ను తిరుపతి కేంద్రంగా నిర్వహించినందుకు లోగోను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment