ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ | AP High Court Chief of Provisional Chief Justice Praveen Kumar | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

Published Fri, Dec 28 2018 1:21 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

AP High Court Chief of Provisional Chief Justice Praveen Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జనవరి 1 నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారం భించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో లాంఛనాలన్నీ శరవేగంగా పూర్తవు తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నియ మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 1న హైకోర్టుకు సెలవు దినం కావడంతో 2వ తేదీన ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏపీకి కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ప్రవీణ్‌కుమారే సీనియర్‌. దీంతో రాష్ట్రపతి ఆయనవైపు మొగ్గు చూపారు. అత్యంత సౌమ్యుడిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు పేరుంది.

ఆ ముగ్గురూ తెలంగాణ హైకోర్టుకు...
ఇదిలా ఉంటే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అలాగే న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ వి.రామసుబ్ర మణియన్‌లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్రపతి కోవింద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో సంప్రదించిన తరువాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కేరళ హైకోర్టుకు చెందిన వారు కాగా, జస్టిస్‌ చౌహాన్‌ రాజస్తాన్, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ చెన్నై హైకోర్టులకు చెందిన వారు. వీరు ముగ్గురు కూడా బయట న్యాయమూర్తులు కావడంతో వీరిని ఏపీ హైకోర్టుకు పంపాలా? తెలంగాణ హైకోర్టుకు పంపాలా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రపతి ఈ ముగ్గురు కూడా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగుతారంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారని హైకోర్టు వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. 

1న ప్రమాణ స్వీకారం...
జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ న్యాయమూర్తులు జనవరి 1న ప్రమాణం చేయ నున్నట్లు తెలిసింది. వీరి చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తారని సమాచారం. ఉన్నతస్థాయి వర్గాల్లో దీనిపై ఓ నిర్ణయం జరిగిందని హైకోర్టు వర్గాల ద్వారా తెలుస్తున్నప్పటికీ, దీనిని ఎవ్వరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తండ్రికి తగ్గ తనయుడు...
జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్‌ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్‌ విద్యాభ్యాసం హైదరాబాద్‌ లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో సాగింది. లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీ నుంచి ఇంటర్‌ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్‌సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్‌ లాపై పట్టు సాధించారు. 2012 జూన్‌ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్‌ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన  నియమితులయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement