అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల నిమిత్తం జారీ చేసిన జీవోను.. అలాగే తమ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలు అన్ ఎయిడెడ్ మైనారిటీ, మైనారిటీయేతర, అటానమస్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రవేశాల నిమిత్తం జీవో 67 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్), ఏ చట్టం కింద ఈ విధానాన్ని తీసుకొచ్చిందో ఎక్కడా పేర్కొనలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు.
యూనివర్సిటీ చట్టం కింద ఫీజులను, ప్రవేశాలను నియంత్రించే అధికారం తమకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదన సమర్థనీయంగా లేదన్నారు. ‘యూనివర్సిటీల చట్టంలో యూనివర్సిటీ అన్న పదం పరిధిలోకి అన్ని అఫిలియేటెడ్ కాలేజీలు, వర్సిటీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు వస్తాయని అదనపు ఏజీ చెబుతున్నారు. ఈ వాదనను ఆమోదిస్తే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ప్రవేశాలే కాదు పోస్టుల సృష్టి, ప్రొఫెసర్లు, రీడర్లు, పాలనా సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హాస్టళ్ల నిర్వహణ, ఫీజుల ఖరారు ఇలా అన్నీ విషయాల్లో కూడా అధికారాలు యూనివర్సిటీకే చెందుతాయి. వాస్తవానికి శాసనకర్త ఉద్దేశం ఇది కాదు.
చట్ట ప్రకారం యూనివర్సిటీ కాలేజీలు వేరు, అఫిలియేటెడ్ కాలేజీలు, రికగ్నైజ్డ్ కాలేజీలు, మహిళా కాలేజీలు వేరు. అదనపు ఏజీ వాదన నిజమైతే చట్టంలో ఇలా ఒక్కో కాలేజీ గురించి ప్రస్తావన చేసి ఉండేవారు కాదు. యూనివర్సిటీల పరిధిని పాలనా సౌలభ్యం కోసమే నిర్ణయించారు తప్ప, ప్రవేశాలను నియంత్రించడానికి కాదు. కాబట్టి అదనపు ఏజీ వాదన సరికాదు. అటానమస్ కాలేజీలు యూజీసీ చట్ట నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రించజాలదు. అన్ ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రంచ లేదని టీఎంఏ పాయ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది’అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.