గ్రామీణ ప్రాంతాల్లో పలు కళాశాలల మూత?
గత ఏడాది లక్ష సీట్లు తగ్గింపు...
కొత్త కోర్సులకే ప్రాధాన్యం
లైఫ్‌సైన్స్ వైపు మళించే ప్రయత్నం..
ఈఏపీసెట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్
ఉన్నత విద్యా మండలి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాశాలల్లో డిగ్రీ సీట్లు ఈ ఏడాది దాదాపు 50 వేలు తగ్గే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌లో సీట్లను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్ళుగా సీట్ల భర్తీ లేకపోవడమే దీనికి కారణంగా ఉన్నత విద్యా మండలి చెబుతోంది. గత విద్యా సంవత్సరంలో కూడా దాదాపు లక్ష సీట్లను కుదించారు.
వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 1050 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ ప్రతీ సంవత్సరం గరిష్టంగా 2.25 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులోనూ బీకాం కోర్సులోనే ఎక్కువగా చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఉంటోంది. బీఏ కోర్సులో ప్రవేశాలు 40 శాతం మించడం లేదు. దాదాపు వంద కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సుల్లో జీరో ప్రవేశాలు నమోదు అవుతున్నాయి.
మరో 150 కాలేజీల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరడం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఉన్నత విద్యా మండలి ఈ పరిస్థితిని సమీక్షించింది.
డిమాండ్ లేని కోర్సులకు సంబంధించిన బ్రాంచీలకు అనుమతించకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 15 శాతం కన్నా విద్యార్థులున్న కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతించే అవకాశం కన్పించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పలు కాలేజీలు ఈ ఏడాది మూతపడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
కొత్త కోర్సులకే ప్రాధాన్యం..
డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సుల్లో కొన్నేళ్ళుగా మార్పులు తెస్తున్నారు. కొన్ని కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 19 రకాల స్కిల్ కోర్సులను సిఫార్సు చేసింది.
రిటైల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టార్‌లో అవసరమైన సేవలు అందించే టెక్నికల్ కోర్సులు, స్టార్టప్స్ పెట్టుకోగల కోర్సులను అందించాలని సూచించింది. కామర్స్‌లో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, బీఎస్సీలో బయో మెడికల్ వంటి కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
రూరల్‌లో కొత్త కోర్సులు తెచ్చినా..?
హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలు కొత్త కోర్సులపై ఆసక్తి చూపుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీలు మాత్రం ముందుకు రావడం లేదు. దీనివల్ల మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల కొరతతో పాటు ఫీజులు పెంచితే విద్యార్థులు చేరేందుకు అవకాశం లేదని ఆ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.
మరోవైపు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సకాలంలో ప్రభుత్వం అందించడం లేదని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులకు వెళ్ళలేమని గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల నిర్వాహకులు అంటున్నారు. లైప్‌సైన్స్ కోర్సులను గత కొన్నేళ్ళుగా అందుబాటులోకి తెచ్చినా కూడా గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు.
మార్పులు అనివార్యం
డిగ్రీ కోర్సుల్లో మార్పు లు అనివార్యం. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం. కాలేజీల్లో అన్ని విధాల మౌలిక వసతులు ఉంటేనే అనుమతులు ఇస్తాం. డిమాండ్ లేని కాలేజీల్లో సీట్లు తగ్గించే ఆలోచన చేస్తున్నాం. ఏపీఈసెట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్ ఇస్తాం.కొత్త కోర్సులను కూడా ఇందులో చేర్చే ఆలోచనలో ఉన్నాం.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్)
Comments
Please login to add a commentAdd a comment