ఇదేం నిబంధన..?
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనడానికి హిందూయేతరులు అనర్హులంటూ టెండర్ నిబంధన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టెండర్ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. కుల, మత, జాతి, లింగ, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 15ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అవుతున్నా దేవాదాయశాఖ ఇప్పటికీ పౌరుల పట్ల మతేతర వ్యవహారాల్లో మతపరమైన వివక్ష చూపుతుండటం శోచనీయమంది.
షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులకు స్థానం లేకుండా చేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని దేవాదాయశాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2016, జనవరి 1 నుంచి 2018, డిసెంబర్ 31 వరకు శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం ఉన్న 1, 2 షాపుల లీజు హక్కుల నిమిత్తం దేవాదాయశాఖ వేలం నోటీసు జారీ చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనేందుకు అనర్హులని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. 1, 2 షాపులను గత 40 ఏళ్లుగా తాము నిర్వహిస్తున్నామని, ప్రతీ వేలంలో తాము అత్యధిక మొత్తాలకు షాపు లీజుల్ని దక్కించుకుంటున్నామని, ఈసారి షాపుల లీజులు పొందేందుకు హిందూయేతరులు అనర్హులంటూ జారీ చేసిన వేలం నోటీసును రద్దు చేయాలంటూ ఆయూబ్ అలీఖాన్, ఎ.ఎం.బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు.
ఈ ధోరణి అవాంఛనీయమైంది..
పిటిషనర్ల తరఫున ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందూయేతరులకు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశమివ్వకుండా టెండర్ నిబంధనలను రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ వ్యక్తమవని అభ్యంతరాలను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూయేతరులు వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులనడంపై విస్మయం వెలిబుచ్చారు. దేవాదాయశాఖ అనుసరిస్తున్న ఈ ధోరణి అవాంఛనీయమైనదిగా తేల్చారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు దేవాదాయశాఖ పనితీరుపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జస్టిస్ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రాథమిక ఆధారాలను బట్టి దేవాదాయశాఖ రూపొందించిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలోని షాపులను మతవిశ్వాసాల ఆధారంగా కేటాయిస్తున్నామని దేవాదాయశాఖ అధికారులే చెప్పట్లేదని, అలాంటప్పుడు హిందూయేతరులను వేలం ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం విధించడం ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వివరణివ్వాలని దేవాదాయశాఖ అధికారుల్ని ఆదేశించారు. పిటిషనర్ల రెండుషాపుల్ని రూ.9,500, రూ.6,000కు వేలంలో ఇతరులు దక్కించుకున్నారని విద్యాసాగర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ మొత్తాల్ని పిటిషనర్లే చెల్లించి, తమ షాపుల్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఈ కొనసాగింపు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.