నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరం
- జస్టిస్ నాగార్జునరెడ్డి స్వచ్ఛంద నిర్ణయం!
- సీజేఐ, ఏసీజే,రాష్ట్ర గవర్నర్‌కు లేఖ!
- ఏసీజే నేతృత్వంలో ఫుల్ కోర్ట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: తనపై రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని స్వచ్ఛందంగా నిర్ణరుుంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి టి.ఎస్.ఠాకూర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, గవర్నర్ నరసింహన్‌లకు తెలియజేసినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాసినట్లు హైకోర్టు వర్గాలు ధ్రువీకరించాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏసీజే నేతృత్వంలో న్యాయమూర్తులందరూ (ఫుల్ కోర్ట్) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అభిశంసన తీర్మానంలో తనపై చేసిన ఆరోపణలు తనను ఎంతగానో వేదనకు గురి చేశాయని జస్టిస్ నాగార్జునరెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తాను సంపాదించుకున్న ప్రతిష్టను కాలరాసేందుకు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజల విశ్వాసం పైనే న్యాయవ్యవస్థ పనిచేస్తుంది. న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించేటప్పుడు నాపై ప్రజలకు విశ్వాసం ఉందనే భావిస్తూ ఉంటాను. నాపై మోపిన ఆరోపణలను చూసి ప్రజల్లో కొందరైనా నా నిబద్ధత, నిజారుుతీపై సందేహం లేవనెత్తే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి న్యాయవ్యవస్థకు క్షేమకరం కాదు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. విధులకు హాజరు కాకూడదన్న నిర్ణయంలో భాగంగానే ఆయన మంగళవారం కోర్టుకు రాలేదు.