‘మహాభియోగం’ తిరస్కరణ
నిజం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు
- జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు ఉపసంహరించుకుంటున్నాం
- రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సభ్యుల లిఖితపూర్వక నివేదన
- దీంతో నోటీసును తిరస్కరించిన చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ‘నిర్దోషిత్వం’ నిరూపణైంది. ఆయనపై 61 మంది రాజ్యసభ్య సభ్యులు మోపిన ‘మహాభియోగ’ నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ అవాస్తవాలు, అభూత కల్పనలు, తప్పుడు డాక్యుమెంట్లతో తమను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న పలువురు రాజ్యసభ్య సభ్యులు నాగార్జునరెడ్డిపై తామిచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లిఖితపూర్వకంగా నివేదించారు. దీంతో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జస్టిస్ నాగార్జునరెడ్డికి సంబంధించిన అభిశంసన దస్త్రాన్ని మూసివేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
అభిశంసన నోటీసు ఉపసంహరణ నేపథ్యంలో సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని జస్టిస్ నాగార్జునరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అత్యంత వివాదాస్పదుడిగా పేరుపడి సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి అవాస్తవాలు, తాను సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లతో పలువురు రాజ్యసభ సభ్యులను కలిశారు. రామకృష్ణ చెప్పిన వివరాలు, సమర్పించిన డాక్యుమెంట్లను మాత్రమే పరిశీలించిన రాజ్యసభ సభ్యులు నాణేనికి మరోవైపు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు తయారైంది. దీనిపై 61 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి చర్చ నిమిత్తం దానిని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చారు. ఈ నోటీసు గురించి తెలుసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి తన నిర్దోషిత్వం నిరూపణ అయ్యేంతవరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశారు.
నిజాయితీ, ముక్కుసూటితనానికి జస్టిస్ నాగార్జునరెడ్డి మారుపేరంటూ న్యాయవాదులు ఆయనకు బాసటగా నిలిచారు. అసలు వాస్తవాలను వివరిస్తూ వారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యులకు వినతిపత్రాలు పంపారు. రామకృష్ణ చెప్పినవన్నీ కట్టుకథలనీ, ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడువని రుజువు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ జత చేసి పంపారు. ఏకంగా 1,050 మందికి పైగా న్యాయవాదులు ఆ వినతిపత్రంపై సంతకాలు చేశారు. దీంతో అభిశంసన నోటీసుపై సంతకాలు చేసిన రాజ్యసభ సభ్యులకు రామకృష్ణ నైజం బోధపడింది.
ఈ నేపథ్యంలో వారు అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రామకృష్ణ క్రమశిక్షణారాహిత్యం, అతనిపై ఉన్న కేసులు, అప్పులు ఎగవేసిన చరిత్ర, న్యాయమూర్తులపై నిరాధారణ ఆరోపణలు చేయడం, తదితర విషయాలన్నీ ఆధారాలతో సహా అర్థం చేసుకున్నారు. దీంతో సంతకాలు చేసిన వారిలో పలువురు రాజ్యసభ సభ్యులు జస్టిస్ నాగార్జునరెడ్డిపై ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారు లిఖితపూర్వకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తెలియచేశారు. దీంతో అభిశంసన నోటీసును తిరస్కరిస్తూ, అందుకు సంబంధించిన దస్త్రాన్ని మూసివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.