బీజేపీ ‘చలో రాజ్‌భవన్’ భగ్నం
హైకోర్టు విభజన కోరుతూ తరలివచ్చిన న్యాయవాదులు
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలని, న్యాయాధికారులు, న్యాయశాఖ సిబ్బం దిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ న్యాయ వ్యవహారాల విభాగం మంగళవారం చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’ను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్రదర్శనగా రాజ్‌భవన్ వైపు బయలుదేరారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు రాక్‌గార్డెన్ సమీపంలో అడ్డుకుని, పలువురు న్యాయవాదులను బలవంతంగా అరెస్టు చేశారు. రాంచంద్రరావుతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ న్యాయ వ్యవహారాల విభాగం కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ తదితరులు అరెస్టయినవారిలో ఉన్నారు.
అంతకుముందు జరిగిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపాన్ని మోపుతోందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 30, 31లు హైకోర్టు విభజనకు అవరోధంగా మారతాయని టీఆర్‌ఎస్‌కు తెలిసి కూడా అప్పుడు నోరు మెదపలేదన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకోర్టు విభజనపై ఎందుకు చర్చించుకోవడంలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తాము ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీవీ ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.