రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న న్యాయవాదులు
హైదరాబాద్: న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ స్వప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో–కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బీసీలు ప్రధాన న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అనుకూలమైన వారు లేరనే కారణంతో ఇటీవల ఉమ్మడి హైకోర్టులో నియమితులైన న్యాయమూర్తులను ఎంపిక దశలోనే నిరోధించే యత్నం చేశారని ఆరోపించారు.
ఉమ్మడి హైకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టుకు పంపిన న్యాయవాదులపై కావాలనే ఆరోపణలు చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన న్యాయవాదులపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలకు 2016 ఏప్రిల్ 30న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి లేఖ రాస్తే నెల రోజుల్లో సీఎం కేసీఆర్ తన అభిప్రాయం పంపగా.. చంద్రబాబు మాత్రం సిఫార్సులను వ్యతిరేకించారన్నారు. బీసీ న్యాయమూర్తుల పట్ల చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవికుమార్, సదానంద్, దేవరాజు, ప్రశాంత్, స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ న్యాయవాదుల ఆందోళనలు
బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలపై కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని వేర్వేరు కోర్టుల్లోని బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రంగారెడ్డి కోర్టుకు చెందిన బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీల ఓట్లు కావాలి.. బీసీలు వద్దా అంటూ ప్రశ్నించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment