ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్
- కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం
- సంబంధిత ఫైల్‌పై ప్రధాని మోదీ సంతకం
- రాష్ట్రపతికి చేరిన నియామక ఫైల్
- నేడో, రేపో ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ నియామకానికి మార్గం సుగమమైంది. ఆయన నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. అందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి సంతకం చేశారు. దీంతో ఈ ఫైలు తుది ఆమోదం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది.
నేడో, రేపో జస్టిస్ జోసెఫ్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నియామకపు ఉత్తర్వులు అందుకున్న తరువాత జస్టిస్ జోసెఫ్ ఉమ్మడి హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్వస్థలమైన కేరళకు వెళ్లి, ఉమ్మడి హైకోర్టుకు దసరా సెలవులు ముగిసిన తరువాత సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోసెఫ్‌ను ఉమ్మడి హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే పలు రాజకీయ కారణాలతో ఈ నియామకానికి కేంద్రం ఇంతకాలం ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ జోసెఫ్ వస్తారా?రారా? అన్న విషయంపై ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అయితే ఉమ్మడి హైకోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గత నెల నుంచి న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా జస్టిస్ జోసెఫ్ నియామకపు ఫైల్‌పై మోడీ సంతకం చేయడంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైంది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయంటూ సంచలన తీర్పునిచ్చిన జస్టిస్ జోసెఫ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇదీ నేపథ్యం...
జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జన్మించారు. కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయం, తరువాత ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత చెన్నై లయోలా కాలేజీలో చేరారు. ఎర్నాకుళంలోని ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. మొదట ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1983లో ప్రాక్టీస్‌ను కేరళకు మార్చారు. ప్రముఖ న్యాయవాది వర్గీస్ ఖల్లియత్ వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూలై 18న ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ జోసెఫ్ తండ్రి జస్టిస్ కె.కె.మాథ్యూ కూడా న్యాయమూర్తే. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. జస్టిస్ జోసెఫ్‌కు అత్యంత సౌమ్యుడిగా, ముక్కుసూటి మనిషిగా పేరుంది.