
సుప్రీం న్యాయమూర్తిగా తిరిగి కేఎం జోసెఫ్ పేరును సిఫార్సు చేసిన కొలీజియం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం మరోసారి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రానికి పంపింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జోసెఫ్ పేరును గతంలో కొలీజియం కేంద్రానికి పంపగా సీనియారిటీ, ప్రాంతీయ సమీకరణాలతో ఆయన పేరును పున:పరిశీలించాలని ప్రభుత్వం వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్‌లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ జస్టిస్ జోసెఫ్ బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించినందుకే కేంద్రం ఆయన పేరును పక్కనపెట్టిందని విపక్షాలు విమర్శించాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ పేరునే సుప్రీం కొలీజియం మరోసారి కేంద్రానికి పంపడంతో దీన్ని ఆమోదించడం మినహా ప్రభుత్వానికి మరో అవకాశం లేదు.
జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్ పేర్లను కూడా కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. మరోవైపు కలకతా హైకోర్టు జడ్జ్ అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చుతూ ఆయన పేరును పున:పరిశీలించాలని కొలీజియంను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment