
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment