uttarakhand high court
-
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్‌దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
గృహిణుల సేవలకు వెలకట్టలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి రూ.2.5 లక్షలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవిత కాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు’అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. విచారించిన ధర్మాసనం ‘ఒక గృహిణి సేవలను రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించడం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు’అని పేర్కొంటూ రూ.6 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం. యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
చార్ధామ్ యాత్రకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ ఉధృతి కారణంగా చార్ధామ్ యాత్ర పునఃప్రారంభంపై జూన్ 28న విధించిన స్టేను ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దీంతో యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చార్ధామ్ యాత్రలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేదార్‌నాథ్‌లో 800 మంది, బద్రీనాథ్‌లో 1,200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది. యాత్రికులు ఈ నాలుగు ధామాల్లో ఎక్కడా కూడా నీటిగుండాల్లో స్నానం చేసేందుకు అనుమతించరాదని సూచించింది. చార్ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి వ్యక్తి కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో జరిగే చార్ధామ్ యాత్రలో అవసరమైన మేరకు పోలీసు బలగాలను మోహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను పునఃప్రారంభించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్లు, పూజారులు యాత్రపై ఆధారపడి ఉపాధి పొందుతుంటారు. -
‘బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. ‘‘బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి’’ అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆమె భర్త జైల్లో ఉన్నది అత్యాచార ఆరోపణల మీద. భర్త ఇలాంటి పనులు చేసి జైలుకెళ్తే ఏ భార్య అయినా అతడి నుంచి విడిపోవాలని అనుకుంటుంది. కానీ నువ్వేంటి తల్లి.. ఏకంగా అతడితో బిడ్డను కనాలనుకుంటున్నావ్.. అసలు రాజ్యంగా ఖైదీలకు ఇలాంటి ఓ హక్కును కల్పించిందా అనే దాని గురించి పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. ఆ వివారలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని తెలిపింది సచిన్ భార్య. ‘‘మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండి’’ అంటూ సచిన్ భార్య హైకోర్టును ఆశ్రయించిది. తనకు మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పిటిషన్ రాలేదని విచారణ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనేత్తింది. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు ఇలా ఉన్నాయి.. ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు. అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడిది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది. -
ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం రెండు రోజుల కిందట ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–2004 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
మైనింగ్‌పై పూర్తి నిషేధం
ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు నెలల పాటు మైనింగ్‌ను పూర్తిగా నిషేధించింది. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపౌ ఉన్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేయాలని, దానిద్వారా అన్ని విషయాలూ తెలుసుకని, నాలుగు నెలల తర్వాత అయినా మైనింగ్‌ను పునరుద్ధరించాలో వద్దో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా 50 ఏళ్లకు సరిపోయేలా ఒక బ్లూప్రింట్‌ను కూడా ఈ కమిటీ తయారుచేయాల్సి ఉంటుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్ వల్ల హిమాలయాల్లోని శివాలిక్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న అడవులు, నదులు, జలపాతాలు, సరస్సులు అన్నీ దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విషయాలు చెప్పింది. సమగ్ర నివేదిక వచ్చేవరకు మైనింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ మాఫియా చేతుల్లో ఒక అటవీ శాఖాధికారి హత్యకు గురి కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మైనింగ్ వ్యవహారాలపై కలకలం రేగింది. అనంతరం దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సుధాంశు ధులియా ఈ ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ వల్ల శివాలిక్ ప్రాంతం బాగా దెబ్బతింటోందని, ఇక రాష్ట్రంలో అసలు అక్రమ మైనింగ్ అన్నది లేకుండా రాష్ట్రప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టుకు తమ నివేదిక ఇచ్చేవరకు రాష్ట్రంలో మైనింగ్ జరగడానికి గానీ, లైసెన్సులు ఇవ్వడానికి గానీ, పునరుద్ధరించడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది. -
ప్రముఖ దర్శకనిర్మాత అరెస్టుపై హైకోర్టు స్టే
బాలీవుడ్ దర్శక నిర్మాత, ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ అరెస్టుపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే మంజూరుచేసింది. సెప్టెంబర్ 19 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. తాను రాసిన నవలలోని కొన్ని భాగాలను క్రిష్-3 సినిమా కోసం వాడేసుకుని కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ డెహ్రాడూన్‌కు చెందిన రూప్ కుమార్ శంకర్ అనే రచయిత ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని రాకేష్ రోషన్ కోర్టును కోరారు. అయితే, అందుకు నిరాకరించిన జస్టిస్ యూసీ ధ్యానీ.. సెప్టెంబర్ 19 వరకు రాకేష్ రోషన్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆయనను అరెస్టు చేయాలా.. వద్దా అనే విషయంలో ఆరోజున కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే క్రిష్ 3 స్క్రిప్టు పూర్తిగా తన సొంతమని, దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని రోషన్ అంటున్నారు. -
ఆ 9మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు
ఉత్తరాఖండ్: అనర్హత వేటు పడిన 9మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు అయింది. తమపై స్పీకర్ వేసిన అనర్హతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో మంగళవారం జరిగే బలపరీక్షలో ఈ తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. న్యాయస్థానం తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్లు అయింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో రేపు హరీశ్ రావత్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇక హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. హరీశ్ రావత్ నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. -
కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే.. 'ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌లో సంబరాల కోలాహలం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీఎం హరీశ్ రావత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకొని టపాకాయలు కాల్చారు. పలువురు పత్రికా ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హృదయేష్ స్పందిస్తూ మరోసారి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన మన న్యాయ వ్యవస్థకు నా సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు. 29న బల పరీక్ష హైకోర్టు తీర్పు నేపధ్యంలో హరీశ్ రావత్ కు మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 29న ఆయన బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇప్పటికే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు బీజేపీతో చేతులు కలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పెద్దలు సమీక్షలు జరిపి బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేంద్రంపై హైకోర్టు సీరియస్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలనను వెంటనే ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించింది. స్పష్టమైన ఆదేశాలిచ్చి వారం రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎందుకు ఉపసంహరించలేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో తమకు కోపం కంటే బాధ కలుగుతోందని ఉన్నత న్యాయస్థానం గురువారం వ్యాఖ్యానించింది. కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారని సూటిగా అడిగింది. 'రేపు రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకరిని ఆహ్వానిస్తారు. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం కాదా. ప్రభుత్వం ఏమైనా ప్రైవేటు పార్టీయా' అని ఘాటుగా ప్రశ్నించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్రం తమ ఆదేశాలను శిరసావహిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేయదని, తమను రెచ్చగొట్టదన్న నమ్మకాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యక్తం చేసింది. -
రాష్ట్రపతి నిర్ణయాన్నీ సమీక్షించొచ్చు
రాష్ట్రపతి పాలనపై ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్య ♦ ఒక్కోసారి రాష్ట్రపతి నిర్ణయం కూడా పొరపాటు కావచ్చు ♦ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు ♦ తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశం నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేసి తమను రెచ్చగొట్టవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ దానిని ఎత్తివేయొద్దని బుధవారం ఆదేశించింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే లేదా తీర్పును రిజర్వు చేయడానికి ముందే ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీని సస్పెండ్ చేయాలన్న రాష్ట్రపతి నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేసింది. ఒక్కోసారి రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కూడా పొరపాటు కావచ్చని, అందువల్ల దానిపై సమీక్ష జరపవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ వాదనలను ప్రస్తావిస్తూ.. తన రాజకీయ విజ్ఞతతో ఆర్టికల్ 356 విధింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఎవరైనా తప్పులు చేయొచ్చు.. అది రాష్ట్రపతి అయినా కావచ్చు లేదా జడ్జీలైనా కావచ్చు’ అని అన్నారు. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రావత్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తీర్పు వెలువడక ముందే లేదా రిజర్వ్ చేయడానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయకుండా.. అలాగే ప్రతిపక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని కోర్టును కోరారు. కోర్టు త్వరితగతిన తీర్పు వెలువరించేలా కేంద్రం ఎటువంటి కుట్రలు పన్నకుండా చూడాలని విన్నవించారు. అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బీమ్‌లాల్ ఆర్యాపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పక్కన పెట్టారన్న కేంద్ర ఆరోపణలపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏప్రిల్ 5న అనర్హత ఫిర్యాదు ఎందుకు చేశారు? మీరు స్పీకర్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం పనిచేసేది ఇలాగేనా? దీని గురించి కేంద్రం ఏం చెబుతుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు. దీనిపై మేము దృష్టి పెట్టాం’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తాను ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని గురువారం కోర్టుకు వివరిస్తామని ఏఎస్జీ మెహతా చెప్పారు. దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా గురువారం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి పొరపాటు చేసుండొచ్చు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదించింది. రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎటువంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయసమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు జరుగుతున్నాయి. -
ఉత్తరాఖండ్ ఖర్చులకు ఆర్డినెన్స్
జారీ చేసిన కేంద్రం డెహ్రాడూన్: ఏప్రిల్ 1 నుంచి ఉత్తరాఖండ్ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ బిల్లు(ఓటాన్ అకౌంట్)కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గురువారం రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీఅయ్యాయి. పార్లమెంట్ సెషన్స్ లేకపోవడంతో... ఉత్తరాఖండ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంపై రాష్ట్రపతి సంతృప్తి చెందారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి ఖర్చుల కోసం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర సంచిత నిధి నుంచి నిధులు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ఖర్చుల కోసం రూ. 13,642.43 కోట్లు ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. కాగా, కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 5లోగా స్పందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 6న పిటీషన్‌పై తిరిగి విచారణ కొనసాగుతుంది. పార్లమెంటును ప్రొరోగ్ చేయడాన్ని వ్యతిరేకించే పిటిషన్‌ను కూడా జత చేసేందుకు రావత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు అనుమతినిచ్చింది.