రాష్ట్రపతి నిర్ణయాన్నీ సమీక్షించొచ్చు
రాష్ట్రపతి పాలనపై ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్య
♦ ఒక్కోసారి రాష్ట్రపతి నిర్ణయం కూడా పొరపాటు కావచ్చు
♦ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు
♦ తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశం
నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేసి తమను రెచ్చగొట్టవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ దానిని ఎత్తివేయొద్దని బుధవారం ఆదేశించింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే లేదా తీర్పును రిజర్వు చేయడానికి ముందే ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతకుముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీని సస్పెండ్ చేయాలన్న రాష్ట్రపతి నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేసింది. ఒక్కోసారి రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కూడా పొరపాటు కావచ్చని, అందువల్ల దానిపై సమీక్ష జరపవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ వాదనలను ప్రస్తావిస్తూ.. తన రాజకీయ విజ్ఞతతో ఆర్టికల్ 356 విధింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఎవరైనా తప్పులు చేయొచ్చు.. అది రాష్ట్రపతి అయినా కావచ్చు లేదా జడ్జీలైనా కావచ్చు’ అని అన్నారు.
రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రావత్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తీర్పు వెలువడక ముందే లేదా రిజర్వ్ చేయడానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయకుండా.. అలాగే ప్రతిపక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని కోర్టును కోరారు. కోర్టు త్వరితగతిన తీర్పు వెలువరించేలా కేంద్రం ఎటువంటి కుట్రలు పన్నకుండా చూడాలని విన్నవించారు. అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే బీమ్‌లాల్ ఆర్యాపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పక్కన పెట్టారన్న కేంద్ర ఆరోపణలపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏప్రిల్ 5న అనర్హత ఫిర్యాదు ఎందుకు చేశారు? మీరు స్పీకర్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం పనిచేసేది ఇలాగేనా? దీని గురించి కేంద్రం ఏం చెబుతుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు. దీనిపై మేము దృష్టి పెట్టాం’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తాను ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని గురువారం కోర్టుకు వివరిస్తామని ఏఎస్‌జీ మెహతా చెప్పారు. దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా గురువారం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది.