కేంద్రంపై హైకోర్టు సీరియస్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలనను వెంటనే ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించింది. స్పష్టమైన ఆదేశాలిచ్చి వారం రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎందుకు ఉపసంహరించలేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో తమకు కోపం కంటే బాధ కలుగుతోందని ఉన్నత న్యాయస్థానం గురువారం వ్యాఖ్యానించింది. కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారని సూటిగా అడిగింది.
'రేపు రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకరిని ఆహ్వానిస్తారు. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం కాదా. ప్రభుత్వం ఏమైనా ప్రైవేటు పార్టీయా' అని ఘాటుగా ప్రశ్నించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్రం తమ ఆదేశాలను శిరసావహిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేయదని, తమను రెచ్చగొట్టదన్న నమ్మకాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యక్తం చేసింది.