సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ ఉధృతి కారణంగా చార్‌ధామ్ యాత్ర పునఃప్రారంభంపై జూన్ 28న విధించిన స్టేను ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దీంతో యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చార్‌ధామ్ యాత్రలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేదార్‌నాథ్‌లో 800 మంది, బద్రీనాథ్‌లో 1,200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది.
యాత్రికులు ఈ నాలుగు ధామాల్లో ఎక్కడా కూడా నీటిగుండాల్లో స్నానం చేసేందుకు అనుమతించరాదని సూచించింది. చార్‌ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి వ్యక్తి కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో జరిగే చార్‌ధామ్ యాత్రలో అవసరమైన మేరకు పోలీసు బలగాలను మోహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్‌ధామ్ యాత్రను పునఃప్రారంభించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్లు, పూజారులు యాత్రపై ఆధారపడి ఉపాధి పొందుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment