stay lifted
-
చార్ధామ్ యాత్రకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ ఉధృతి కారణంగా చార్ధామ్ యాత్ర పునఃప్రారంభంపై జూన్ 28న విధించిన స్టేను ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దీంతో యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చార్ధామ్ యాత్రలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేదార్‌నాథ్‌లో 800 మంది, బద్రీనాథ్‌లో 1,200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది. యాత్రికులు ఈ నాలుగు ధామాల్లో ఎక్కడా కూడా నీటిగుండాల్లో స్నానం చేసేందుకు అనుమతించరాదని సూచించింది. చార్ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి వ్యక్తి కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో జరిగే చార్ధామ్ యాత్రలో అవసరమైన మేరకు పోలీసు బలగాలను మోహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను పునఃప్రారంభించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్లు, పూజారులు యాత్రపై ఆధారపడి ఉపాధి పొందుతుంటారు. -
AP: జీవో- 44 అమలుపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టం అమలును సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని అసలైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యా యమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధనల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 44 అమలుపై హైకోర్టు గతంలో స్టే విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రతి విద్యా సంవత్సరంలో లక్షల మంది పిల్లలు ఉచిత సీట్లను కోల్పోతున్నారని వివరించారు. ఇది విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధన అమలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికపై గందరగోళం
► సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు వాయిదా వేసిన కార్మిక శాఖ ► కానీ ఈ ఎన్నిక నిర్వహణకు అనుమతినిచ్చిన హైకోర్టు ► ‘వాయిదా’పై స్పందించని అధికారులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికలు గందరగోళంగా మారాయి. శుక్రవారం జరగాల్సిన ఈ ఎన్నికలపై ఇటీవల సిటీ సివిల్‌కోర్టు స్టే విధించడంతో.. వాటిని వాయిదా వేస్తూ కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఎన్నికలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు గురువారమే అనుమతినిచ్చింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ అధికారులు స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. స్పందించని కార్మిక శాఖ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలకు కలిపి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కొద్దిరోజుల కింద సిటీ సివిల్ కోర్టులో కేసు వేసింది. దాంతో ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేస్తూ రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇస్లావత్ గంగాధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై జెన్కో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. కానీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఎన్నికలు జరుగుతాయా? లేదా ? అన్న దానిపై స్పష్టత లేక క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ అధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.