ప్రముఖ దర్శకనిర్మాత అరెస్టుపై హైకోర్టు స్టే
బాలీవుడ్ దర్శక నిర్మాత, ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ అరెస్టుపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే మంజూరుచేసింది. సెప్టెంబర్ 19 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. తాను రాసిన నవలలోని కొన్ని భాగాలను క్రిష్-3 సినిమా కోసం వాడేసుకుని కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ డెహ్రాడూన్‌కు చెందిన రూప్ కుమార్ శంకర్ అనే రచయిత ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని రాకేష్ రోషన్ కోర్టును కోరారు.
అయితే, అందుకు నిరాకరించిన జస్టిస్ యూసీ ధ్యానీ.. సెప్టెంబర్ 19 వరకు రాకేష్ రోషన్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆయనను అరెస్టు చేయాలా.. వద్దా అనే విషయంలో ఆరోజున కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే క్రిష్ 3 స్క్రిప్టు పూర్తిగా తన సొంతమని, దాన్ని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని రోషన్ అంటున్నారు.