ఉత్తరాఖండ్ హైకోర్టు సూచన!
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్‌దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్‌ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.
ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు.
అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment