Jasthi chalameswar
-
‘సుప్రీం’ కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదివారం కొత్త రోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రోస్టర్ జూలై 2 నుంచి (వేసవి సెలవుల ముగిసి కోర్టు ప్రారంభం అయ్యాక) అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైరైన రెండ్రోజుల్లోనే ఈ జాబితా సిద్ధవమడం గమనార్హం. ఈ రోస్టర్ ప్రకారం.. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సామాజిక న్యాయం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, కోర్టు ధిక్కరణతోపాటు అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించనుంది. రెండో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలు, పరోక్ష పన్నులు, పర్సనల్ లా– కంపెనీ లా కేసులను విచారించనుంది. జస్టిస్ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యావరణ అసమతుల్యత, అటవీ సంరక్షణ, జంతు సంరక్షణ, భూగర్భ జలాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. మరో సీనియర్ జడ్జి జోసెఫ్ కురియన్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలతోపాటు అద్దె చట్టం, కుటుంబ వివాదాలు, కోర్టు ధిక్కరణ, పర్సనల్ లా కేసులను విచారిస్తుంది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియంలో కొత్తగా చేరిన జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. పరోక్ష పన్నులతోపాటు ఎన్నికలు, క్రిమినల్ కేసులు, ఆర్డినరీ సివిల్ కేసులు, న్యాయాధికారుల నియామకం తదితర అంశాలను విచారిస్తుంది. ఈ ఐదుగురితోపాటు.. మరో ఆరుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోనూ ధర్మాసనాలు ఏర్పాటుచేసినట్లు కొత్త రోస్టర్ పేర్కొంది. ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్, ఏఎమ్ సప్రేల నేతృత్వంలోనూ పలు కేసుల కేటాయింపులతో ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. -
జస్టిస్ గొగోయ్‌కి అన్ని అర్హతలున్నాయి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు. కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ! సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు. -
సంక్షోభంపై జస్టిస్ చలమేశ్వర్ ‘నో కామెంట్స్’!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ప్రస్తుత సంక్షోభంపై వ్యాఖ్యానించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించారు. జనవరి 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మీడియా ముందు ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ ఒకరు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. జస్టిస్ చలమేశ్వర్ సోమవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు సుప్రీంకోర్టు సంక్షోభంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా, ముకుళిత హస్తాలతో ‘నో కామెంట్స్’ అంటూ వెళ్లిపోయారు. -
గవర్నర్‌తో సుప్రీంకోర్టు జడ్జి భేటీ
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రెండు రోజుల తిరుపతి పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ఆయన దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లు సమాచారం.