ఢిల్లీలో నూతన సీజేఐగా జస్టిస్ గొగోయ్ చేత ప్రమాణంచేయిస్తున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్ కోర్టు నంబర్ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు. నవంబర్ 17, 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. వస్తూనే రోస్టర్‌పై ఈయన తన ముద్ర చూపించారు. కేసుల కేటాయింపులో పలు మార్పులు చేశారు.
దేశానికి ఆ అనుభవం అవసరం: మోదీ
సీజేఐగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరయ్యారు. ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విశేషానుభవం, అంతఃశుద్ధి, న్యాయపరమైన అంశాలపై నైపుణ్యత దేశానికి ఎంతగానో మేలుచేస్తాయని భావిస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా జస్టిస్ గొగోయ్ ఎంపికపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. సీనియారిటీ ప్రకారం ఆయన్నే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయనను తదుపరి సీజేఐగా ప్రతిపాదించారు.
ఈ ఏడాది జనవరి 11న సుప్రీంకోర్టు నలుగురు సీనియర్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో (జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ జోసెఫ్ కురియన్) నాటి సీజేఐ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కోర్టు నంబర్ 1లో జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనంతో కలిసి జస్టిస్ గొగోయ్ న్యాయవాదులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత, అత్యవసరంగా విచారించాల్సిన కేసుల పేరుతో కోర్టుముందుకు పిటిషన్లు తీసుకురావద్దని వారికి సూచించారు. ఇలాంటి కేసుల విచారణ విషయంలో పలు నిబంధనలను మార్చాల్సి ఉన్నందున అంతవరకు అత్యవసర కేసులను స్వీకరించబోమని సీజేఐ స్పష్టం చేశారు.
‘కొన్ని నిబంధనలను మార్చాలని భావిస్తున్నాం. ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. రేపు ఎవర్నయినా ఉరితీస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అనే పరిస్థితి ఉంటే.. మేమే దాన్ని అత్యవసరంగా అర్థం చేసుకుంటాం. అవి మినహా మిగిలిన కేసుల్లో అత్యవసరాన్ని చేర్చకండి’ అని సీజేఐ గొగోయ్ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్ర మంలో గొగోయ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సహచరులు కలిసి ఉత్తమమైన ఫలితాలు సాధించే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాం. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కేసుల ఫైలింగ్, లిస్టింగ్ మధ్య సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాం. జాబితా నుంచి కేసులు తొలగించకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.
రోస్టర్‌పై గొగోయ్ ముద్ర
గొగోయ్ బాధ్యతలు స్వీకరించగానే సుప్రీంకోర్టులో రోస్టర్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తాజా మార్పులను ఉంచారు. సీజేఐ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసులకు ఇదే రోస్టర్ అమలవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్, సెబీ, బీమా, ఆర్‌బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్ కార్పస్, క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్ అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖల ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు.
చేతల్లోనూ ఆదర్శప్రాయుడు!
ఉన్నత కుటుంబంలో భోగభాగ్యాల మధ్య పెరిగినా సాధారణ జీవితం గడపడంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తన ఆస్తులు, ఆదాయం ఇతర విషయాల్లో దాపరికానికి అవకాశం లేని విధంగా తన స్థిర, చరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాల వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ప్రస్తుతమున్న 25 మంది సిట్టింగ్ జడ్జీల్లో 11 మందే ఈ విధంగా ఆస్తుల ప్రకటన చేశారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినపుడే ఇచ్చిన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, వివాహ సమయంలో భార్యకు పుట్టింటి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రకటించారు.
సొంత వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకు రుణాలు కూడా లేవు. రెండు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.6.5 లక్షలు, రూ.16 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి. 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్‌ఐసీ పాలసీ ముగిశాక వచ్చిన డబ్బే ఆయన బ్యాంకు బాలెన్స్‌లో ప్రధాన వాటాగా నిలుస్తోంది. పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1.6 లక్షల విలువైన బంగారాన్ని కొన్నా రు. 1999లో గువాహటిలో కొనుగోలు చేసిన రూ.1.10 లక్షల విలువైన స్థలాన్ని 2018 జూన్ 6న విక్రయించారు. అస్సాంలోని కామ్‌రూప్ జిల్లా జపోరిగోగ్ బెల్‌టోలా గ్రామంలో తల్లి ద్వారా సంక్రమించిన కొంత భూమి (అందులో నిర్మించిన ఇంటిని కూల్చివేశారు) మాత్రమే కలిగి ఉన్నారు.
దిబ్రూగఢ్ నుంచి సీజేఐగా
1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆయన జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.2010, సెప్టెంబర్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment