Roster policy
-
సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం!
సాక్షి, న్యూఢిల్లీ: వేసవి సెలవుల అనంతరం జూలై 3వ తేదీ నుంచి దాఖలైన పిటిషన్ల కేటగిరీల ఆధారంగా సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)లు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా సీనియర్ జడ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తుంది. తాజా కేసుల జాబితా, ప్రస్తావనలకు సంబంధించిన నూతన ప్రక్రియ కూడా జూలై 3 నుంచి అమలులోకి రానుంది. మంగళవారం నాటికి ధ్రువీకరించిన తాజా కేసులు ఆటోమేటిక్‌గా సోమవారానికి, మిగిలినవి శుక్రవారం జాబితా చేయనున్నారు. తాజా కేసులను సీఐఐ ఎదుట లాయర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తావన ప్రొఫార్మాలు మధ్యాహ్నం 3 గంటలలోపు సమరి్పస్తే తదుపరి రోజు ధర్మాసనాలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయి. అదే రోజున జాబితా చేర్చాలని కోరుకొనే పక్షంలో ఉదయం 10.30 గంటల లోపు అత్యవసర లేఖతో ప్రొఫార్మాను సంబంధిత అధికారికి అందజేయాలి. వీటిపై భోజన విరామ సమయంలో సీజేఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
సుప్రీంలో ‘కొత్త రోస్టర్’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్), లెటర్ పిటిషన్లు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు విచారించనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేసుల విచారణ విషయంలో కొత్త రోస్టర్ ఆఫ్ అసైన్మెంట్ను రూపొందించారు. నూతన రోస్టర్ విధానం ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది నవంబర్ 29న విడుదల చేసిన రోస్టర్ ప్రకారం.. ఇలాంటి పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. -
సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సీనియర్లు విచారించనున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఉన్నారు. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇందులో కోర్టు ధిక్కారం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, సోషల్ జస్టిస్ వంటి అంశాల కేసులు సీజేఐ పరిధిలో ఉంటాయి. ట్రాయ్, ఎంక్వైరీ కమిషన్, కంపెనీ లా వంటి వాటి కేసులను కూడా సీజేఐ తన పరిధిలోనే ఉంచుకున్నారు. సాయుధ బలగాలు, పారామిలిటరీ, సాధారణ, క్రిమినల్ సివిల్ కేసులు, ట్రిబ్యునల్‌కు సంబంధించిన కేసులను ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భూ సేకరణలు, మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు, కొత్త విద్యా సంస్థలకు సంబంధించిన కేసులను జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ప్రభుత్వాలు, లోకల్ బాడీల కాంట్రాక్టులు, కేసుల లీజులు, ఫ్యామిలీ లా వంటి వ్యవహారాలను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. -
46వ సీజేఐగా జస్టిస్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్ కోర్టు నంబర్ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు. నవంబర్ 17, 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. వస్తూనే రోస్టర్‌పై ఈయన తన ముద్ర చూపించారు. కేసుల కేటాయింపులో పలు మార్పులు చేశారు. దేశానికి ఆ అనుభవం అవసరం: మోదీ సీజేఐగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరయ్యారు. ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విశేషానుభవం, అంతఃశుద్ధి, న్యాయపరమైన అంశాలపై నైపుణ్యత దేశానికి ఎంతగానో మేలుచేస్తాయని భావిస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా జస్టిస్ గొగోయ్ ఎంపికపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. సీనియారిటీ ప్రకారం ఆయన్నే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయనను తదుపరి సీజేఐగా ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరి 11న సుప్రీంకోర్టు నలుగురు సీనియర్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో (జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ జోసెఫ్ కురియన్) నాటి సీజేఐ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కోర్టు నంబర్ 1లో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనంతో కలిసి జస్టిస్ గొగోయ్ న్యాయవాదులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత, అత్యవసరంగా విచారించాల్సిన కేసుల పేరుతో కోర్టుముందుకు పిటిషన్లు తీసుకురావద్దని వారికి సూచించారు. ఇలాంటి కేసుల విచారణ విషయంలో పలు నిబంధనలను మార్చాల్సి ఉన్నందున అంతవరకు అత్యవసర కేసులను స్వీకరించబోమని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొన్ని నిబంధనలను మార్చాలని భావిస్తున్నాం. ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. రేపు ఎవర్నయినా ఉరితీస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అనే పరిస్థితి ఉంటే.. మేమే దాన్ని అత్యవసరంగా అర్థం చేసుకుంటాం. అవి మినహా మిగిలిన కేసుల్లో అత్యవసరాన్ని చేర్చకండి’ అని సీజేఐ గొగోయ్ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్ర మంలో గొగోయ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సహచరులు కలిసి ఉత్తమమైన ఫలితాలు సాధించే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాం. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కేసుల ఫైలింగ్, లిస్టింగ్ మధ్య సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాం. జాబితా నుంచి కేసులు తొలగించకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. రోస్టర్‌పై గొగోయ్ ముద్ర గొగోయ్ బాధ్యతలు స్వీకరించగానే సుప్రీంకోర్టులో రోస్టర్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో తాజా మార్పులను ఉంచారు. సీజేఐ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసులకు ఇదే రోస్టర్ అమలవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్, సెబీ, బీమా, ఆర్బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్ కార్పస్, క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్ అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖల ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు. చేతల్లోనూ ఆదర్శప్రాయుడు! ఉన్నత కుటుంబంలో భోగభాగ్యాల మధ్య పెరిగినా సాధారణ జీవితం గడపడంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తన ఆస్తులు, ఆదాయం ఇతర విషయాల్లో దాపరికానికి అవకాశం లేని విధంగా తన స్థిర, చరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించారు. ప్రస్తుతమున్న 25 మంది సిట్టింగ్ జడ్జీల్లో 11 మందే ఈ విధంగా ఆస్తుల ప్రకటన చేశారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినపుడే ఇచ్చిన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, వివాహ సమయంలో భార్యకు పుట్టింటి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రకటించారు. సొంత వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకు రుణాలు కూడా లేవు. రెండు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.6.5 లక్షలు, రూ.16 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీ ముగిశాక వచ్చిన డబ్బే ఆయన బ్యాంకు బాలెన్స్‌లో ప్రధాన వాటాగా నిలుస్తోంది. పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1.6 లక్షల విలువైన బంగారాన్ని కొన్నా రు. 1999లో గువాహటిలో కొనుగోలు చేసిన రూ.1.10 లక్షల విలువైన స్థలాన్ని 2018 జూన్ 6న విక్రయించారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా జపోరిగోగ్ బెల్టోలా గ్రామంలో తల్లి ద్వారా సంక్రమించిన కొంత భూమి (అందులో నిర్మించిన ఇంటిని కూల్చివేశారు) మాత్రమే కలిగి ఉన్నారు. దిబ్రూగఢ్ నుంచి సీజేఐగా 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆయన జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.2010, సెప్టెంబర్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
మాస్టర్ రోస్టర్ సీజేఐనే: సుప్రీం
న్యూఢిల్లీ: ‘మాస్టర్ రోస్టర్’ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)నే అని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. విశేషాధికారాలతోపాటు వివిధ ధర్మాసనాలకు కేసులను కేటాయించే అధికారం సీజేఐదేనని తేల్చి చెప్పింది. కేసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంచ్.. ‘సమానుల్లో ప్రథముడు సీజేఐ, కోర్టు పరిపాలన వ్యవహారాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టే అధికారం ఆయనకు ఉంది’ అని తెలిపింది. ‘మాస్టర్ రోస్టర్‌గా సీజేఐను పేర్కొనడంలో ఎలాంటి వివాదమూ లేదు. సుప్రీంకోర్టులోని వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించే అధికారం ఆయనకు ఉంది’ అని జస్టిస్ ఏకే సిక్రీ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ భూషణ్ కూడా తన తీర్పులో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కేసులను కేటాయించడంతోపాటు వివిధ ధర్మాసనాలకు ఆ బాధ్యతలను అప్పగించే విశేషాధికారం సీజేఐకు ఉంది. సుప్రీంకోర్టు పాటిస్తున్న ప్రమాణాలు, పద్ధతులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయి. ఇప్పుడు వాటిని మార్చకూడదు. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ప్రధాన న్యాయమూర్తి. ఆయనే అధికార ప్రతినిధి, న్యాయవ్యవస్థకు నాయకుడు’ అని పేర్కొన్నారు. సీజేఐకి కేసుల కేటాయింపులో విశేషాధికారాలు ఉండరాదనీ, కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన బెంచ్‌కు అప్పగించాలని శాంతి భూషణ్ తన పిల్లో కోరారు. -
రోస్టర్ విధానంపై నేడు తీర్పు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అవలంబిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఏప్రిల్ 27నే తీర్పును రిజర్వు చేసింది. -
‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం పిటిషన్ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా(పంజాబ్), అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు. సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’ అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చలమేశ్వర్‌ను సిబల్ కోరారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్ విజ్ఞప్తి చేశారు. 64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్ కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్‌ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్ కౌల్ సూచించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు. -
ఏప్రిల్ 27న సీజేఐపై పిల్ విచారణ
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది. కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. పిల్లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు. -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
అభిశంసనే సమాధానం కాదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అభిశంసన అన్ని సమస్యలకు పరిష్కారం కాదని.. వ్యవస్థను సరిచేయటమే సరైన మార్గమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనాలకు కేసులు కేటాయించటంలో సీజేఐ పాత్రకు సంబంధించిన పలు ప్రశ్నలకూ చలమేశ్వర్ సమాధానమిచ్చారు. ‘రోస్టర్‌పై సంపూర్ణాధికారం సీజేఐదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ధర్మాసనాలను ఏర్పాటుచేయటం సీజేఐకి ఉన్న అధికారం. అయితే ఇది అధికారాన్ని అనుభవించేందుకు మాత్రమే కాదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారాలిచ్చేందుకు కూడా దోహదపడాలి. అలాగని అభిశంసన సరైన సమాధానం కాదు. పరిష్కారం వెతకాలి కానీ.. తొలగింపు సరికాదు’ అని చలమేశ్వర్ తెలిపారు. జనవరి 12న ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐపై బహిరంగ విమర్శలు చేసిన నలుగురిలో జస్టిస్ చలమేశ్వర్ ఒకరన్న విషయం విదితమే. హార్వర్డ్ క్లబ్ ఆఫ్ ఇండియా (అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయులు ఏర్పాటుచేసుకున్న క్లబ్) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్.. జస్టిస్ చలమేశ్వర్‌కు కొంతకాలంగా న్యాయవ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ప్రభుత్వానికి మేలు చేసే ఉద్దేశంతోనే సీజేఐ ధర్మాసనాలను ఏర్పాటుచేస్తున్నారా? తను కోరుకున్న తీర్పులు ఇప్పించుకునేందుకే సీజేఐ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా?’ అనే ప్రశ్నలపై స్పందించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. ‘జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై వెల్లడించిన తీర్పులోనూ మేం (జస్టిస్ గొగోయ్‌తో కలిసి).. వ్యవస్థను సరైన దార్లో పెట్టాల్సిన మెకానిజం గురించే పేర్కొన్నాం’ అని అన్నారు. కొలీజియంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సీజేఐతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న వ్యాఖ్యలపై చలమేశ్వర్ విభేదించారు. ‘మేం మా వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడటం లేదు. సంస్థాగత అంశాలపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. దీనర్థం మేం ఒకరినొకరం విమర్శించుకుంటామని కాదు’ అని తెలిపారు. జూన్ 22న తన రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవులూ ఆశించటం లేదన్నారు. విపక్ష పార్టీలు అభిశంసనకోసం సంతకాల సేకరణ చేపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చలమేశ్వర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సుప్రీంలో త్వరలో పారదర్శక రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంలో దాఖలయ్యే సున్నితమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను(పిల్) ధర్మాసనాలకు కేటాయించే విషయంలో మరింత పారదర్శతక కోసం అందిన సలహాలను సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పరిశీలించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేసులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. మరోవైపు సుప్రీం సంక్షోభం నివారణకు సీజేఐతో నలుగురు సీనియర్ జడ్జీలు సోమవారం భేటీ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. -
ఐఏఎస్‌ల రోస్టర్‌పై నేడు డ్రా
* ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలో తేల్చనున్న ప్రత్యూష్ సిన్హా కమిటీ * రోస్టర్ అనివార్యమైన అధికారుల్లో టెన్షన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించి రోస్టర్ విధానం ఏ రాష్ర్టం నుంచి ప్రారంభించాలనే అంశంపై శనివారం ఢిల్లీలో జరిగే సమావేశంలో డ్రా తీయనున్నారు. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు ఐఏఎస్‌ల సంఘం కార్యదర్శి రేమండ్ పీటర్, ఐఎఫ్ఎస్ల సంఘం నుంచి చోట్రాయ్, ఐపీఎస్‌ల సంఘం నుంచి మాలకొండయ్య పాల్గొననున్నారు. డ్రా అనంతరం నిబంధనల మేరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీకి వారంరోజుల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అరుుతే ఇప్పటివరకు పంపకం ఎప్పుడు జరుగుతుందా..? అని ఎదురు చూసిన ఐపీఎస్ అధికారుల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏపీకే చెందినవారై, రోస్టర్ విధానం అనివార్యమైన అధికారులతో పాటు రోస్టర్ విధానమే శరణ్యమైన రాష్ట్రేతరుల్లోనూ టెన్షన్ నెలకొని ఉంది. కమిటీ చేపట్టే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీ, తెలంగాణల నుంచి ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందం వెళ్తోంది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియను మొదలుపెట్టిన సిన్హా కమిటీ మేలో ఐపీఎస్‌ల నుంచి ఆప్షన్లతో పాటు ఎక్కడకు కేటాయిస్తే అక్కడకు వెళ్తామంటూ హామీ పత్రాన్ని కూడా తీసుకుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ ఏడాది మేలోనే ఏపీకి 144 ఐపీఎస్ పోస్టులు కేటాయించింది. ఐపీఎస్ పోస్టుల భర్తీ రెండు రకాలుగా జరుగుతుంది. యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఎంపికయ్యే వారిని డెరైక్ట్ రిక్రూటీలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డీఎస్పీగా ఎంపికై, నిర్ణీత సర్వీసు పూర్తి చేసుకున్న తరవాత ఐపీఎస్ హోదా పొందే వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పరిగణిస్తారు. సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో ప్రతి 100 పోస్టులకు 67 మంది డెరైక్ట్ రిక్రూటీలు, 33 మంది కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఉండాలి. ఈ లెక్క ప్రకారం సీమాంధ్రకు 101 డెరైక్ట్ రిక్రూట్, 43 కన్ఫర్డ్ పోస్టులు, తెలంగాణకు 78, 34 చొప్పున కేటాయించారు. 67% డెరైక్ట్ ఐపీఎస్ పోస్టుల్లోనూ 2/3 వంతు బయటి రాష్ట్రాలకు చెందిన వారు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉండాలి. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటే డిప్యుటేషన్లపై ఆ లోటును పూడుస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులైన కన్ఫర్డ్, డెరైక్ట్ ఐపీఎస్‌ల సంఖ్య నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో అదనంగా ఉన్న ఈ అధికారుల్ని రోస్టర్ పద్దతిలో రెండు రాష్ట్రాలకూ పంచాల్సిన అవసరం ఏర్పడింది. సీనియర్లను మినహారుుంచి అత్యంత జూనియర్లను ఈ జాబితాలోకి తీసుకుంటారు. వీరికి తోడు రాష్ట్రేతర అధికారుల్నీ ఈ విధానంలోనే పంచనున్నారు. ప్రస్తుతం కీలక పోస్టుల్లో పని చేస్తున్న టీపీ దాస్, ఏఆర్ అనురాధ, ఆర్పీ ఠాకూర్, వీఎస్కే కౌముది, హరీష్‌కుమార్ గుప్తా తదితరులంతా ఏపీ రాష్ట్రేతరులే. అయితే వీరిలో అనురాధ మాత్రమే పూర్తి సేఫ్ జోన్లో ఉన్నారు. ఆమె రోస్టర్ ప్రకారం ఏ రాష్ట్రానికి వెళ్లినా... భర్త సురేంద్రబాబు రాష్ట్రానికే చెందిన అదనపు డీజీ కావడంతో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధ కేటాయింపునకు ఢోకా లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ డీజీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి భద్రతల విభాగం ఐజీ హరీష్‌కుమార్ గుప్తా ఇతర సిబ్బందితో కలిసి జెండాను ఎగుర వేశారు.