న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది.
కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్‌ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.
పిల్‌లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం
శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్‌లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment