జస్టిస్ జె.చలమేశ్వర్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు.
సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు.
మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్
‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి.
దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు.
ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్
సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది.
ఆరు నెలలుగా...
సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది.
► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు.
► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ.
► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం.
► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్.
► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ.
► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ
► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం.
Comments
Please login to add a commentAdd a comment