Justice chalameshvar
-
జస్టిస్ చలమేశ్వర్.. విధులకు వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన చివరి పనిదినం నాడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ వేదిక పంచుకున్నారు. సీజేఐతో కలిసి వేదిక పంచుకోరంటూ వచ్చిన ఊహాగానాలకు ఆయన తెరదించారు. జూన్ 22న జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ చేస్తున్నప్పటికీ.. శుక్రవారమే ఆయనకు చివరి పనిదినం. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వేసవి సెలవులు. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కలసి కోర్టు నంబర్–1లో జస్టిస్ చలమేశ్వర్ కూర్చున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వారు తమ చివరి పనిదినం నాడు ప్రధాన న్యాయమూర్తితో కోర్టు నంబర్–1ను పంచుకోవడం ఆనవాయితీ. బెంచ్‌పై ఉన్నంతసేపూ సీజేఐ జస్టిస్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ స్నేహపూర్వకంగా కనిపించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్.. తమ ముందుకొచ్చిన 11 కేసుల్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా జస్టిస్ చలమేశ్వర్‌తో చర్చించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, గోపాల్ శంకరనారాయణన్ తదితరులు వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం అందరికీ నమస్కరిస్తూ కోర్టు హాలు నుంచి సీజేఐతో కలసి జస్టిస్ చలమేశ్వర్ వెళ్లిపోయారు. 2011 అక్టోబర్ 11వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్‌లు ఇద్దరూ ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడం గమనార్హం. నిబద్ధతలో ఆయన ‘సుప్రీం’ సంచలనాలకు కేంద్ర బిందువైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్రవేశారు. సుప్రీంకోర్టు జడ్జీగా దాదాపు ఏడేళ్లలో ఎన్నో కీలక తీర్పుల్లో ప్రధాన భాగస్వామిగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యాక ఆయన అదే కోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. 2007–11 మధ్య గువాహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబర్ 17, 2015.. ఎన్‌జేఏసీ కేసులో అసమ్మతి తీర్పు నుంచి జనవరి 12, 2018న మరో ముగ్గురు సుప్రీం జడ్జిలతో కలిసి విలేకరుల సమావేశంలో సుప్రీంలో పాలనా వ్యవహారాల్ని ప్రశ్నించే వరకూ న్యాయవ్యవస్థ గౌరవం పెరగడానికి ఆయన కృషిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై అసమ్మతి వ్యక్తంచేస్తూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జనవరి 12న చలమేశ్వర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఒక సంచలనం. కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి మిశ్రా ధోరణిని జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు కొలీజియం సభ్యులైన జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు తప్పుపట్టారు. జస్టిస్ మిశ్రాకు రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. సుప్రీం జడ్జిగా రిటైరయ్యాక తానే పదవి తీసుకోనని చలమేశ్వర్ ముందే ప్రకటించారు. జస్టిస్ చలమేశ్వర్ చరిత్రాత్మక తీర్పులు ►జడ్జిల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం చెల్లదని అక్టోబర్ 17, 2015న ధర్మాసనంలోని నలుగురు జడ్జిలు మెజారిటీ తీర్పు ఇవ్వగా, దానిని సమర్థించిన ఏకైక జడ్జిగా చలమేశ్వర్ నిలిచారు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదని తీర్పులో విమర్శించారు. ►ఎవరికైనా ‘చికాకు లేదా ఇబ్బంది’ కలిగించే ఈ మెయిల్ సందేశాలు ఇచ్చేవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఏ సెక్షన్ చెల్లదని జస్టిస్ నారిమన్‌తో కలిసి జస్టిస్ చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ►ఆధార్ కార్డు లేదనే సాకుతో ఏ పౌరునికి మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్‌లతో కలిసి చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ జేజే పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. ►అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులే కాకుండా జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడ్డవారు కూడా ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆయన తీర్పునిచ్చారు. -
వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన జస్టిస్ చలమేశ్వర్
న్యూఢిల్లీ: వచ్చే నెల 22న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) తలపెట్టిన వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గతవారం జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసి వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించగా ఆయన తిరస్కరించారని ఎస్సీబీఏ కార్యదర్శి వికాస్ సింగ్ తెలిపారు. దీంతో బుధవారం తాము మరోసారి వెళ్లి, ఆయన్ను ఒప్పించేందుకు యత్నించగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ అయినప్పుడూ వీడ్కోలు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి పనిదినమైన ఈనెల 18న జస్టిస్ చలమేశ్వర్ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వికాస్ సింగ్ వివరించారు. కాగా, జస్టిస్ చలమేశ్వర్ గత మూడు వారాలుగా బుధవారం రోజు కోర్టు విధులకు హాజరుకావడం లేదని కోర్టు వర్గాలు తెలిపాయి. -
ఏప్రిల్ 27న సీజేఐపై పిల్ విచారణ
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది. కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. పిల్లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు. -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
‘సుప్రీం విశ్వసనీయతకు విఘాతం’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ విమర్శలతో సర్వోన్నత న్యాయస్ధానం విశ్వసనీయత దెబ్బతిందని మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి ఆందోళన వ్యక్తం చేశారు. ‘సీనియర్ న్యాయమూర్తుల వ్యాఖ్యలతో సుప్రీం కోర్టు విశ్వసనీయత కోల్పోయింది..అది ఎంతవరకూ అన్నది అందరికీ తెలుసు..న్యాయవ్యావస్థ పట్ల ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పాదురొల్పాల్సిన అవసరం ఉంద’ ని సోధి అన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రజల్లో చులకన చేసేలా నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలున్నాయని చెప్పారు. మరోవైపు ఆదివారం ఉదయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ మిశ్రా జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బార్ కౌన్సిల్ బృందం మరో ముగ్గురు జడ్జీలు రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తితోనూ భేటీ అయి న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభంపై చర్చించనున్నారు. -
విభజన ఎప్పటికీ శేషప్రశ్నే!
-
విభజన ఎప్పటికీ శేషప్రశ్నే!
- ఉండవల్లి పుస్తకావిష్కరణలో సుప్రీం జడ్జి చలమేశ్వర్ - చరిత్రలో చాలా ఘటనలు అలాగే ఉండిపోతాయి - రాజ్యాంగ బద్ధంగా జరగలేదన్నదే బాధ: ఉండవల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాసయిందా, లేదా? అనేది కూడా చరిత్రలో చాలా సంఘటనల మాదిరే ఎప్పటికీ శేష ప్రశ్నేనని అభిప్రాయపడ్డారు. సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రచించిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే గ్రంథాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆదివారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ జరిగి పోయిన విడాకులకు బాజాలెందుకని చమత్కరించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ పుస్తకాన్ని చదివినప్పుడు విభజన సమయంలో ఏయే నాయకుడు వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించారో, ఏ పాత్ర పోషించారనేది తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాసయిందా? లేదా? అనే సందేహాన్ని రచయిత లేవనెత్తారని, చరిత్రలో చాలా సంఘటనలు అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయన్నారు. విభజన రాజ్యాంగ బద్ధమా కాదా? వాస్తవం ఏమిటి? సభలో ఏమి జరిగింది? అనేవి లోపల కూర్చున్న వారికే తెలియాలన్నారు. ‘చరిత్రలో అనేకం జరిగాయి. తెలుగు మాట్లాడే వారి రాజకీయ చరిత్ర ఏ ఆరేడు వందల ఏళ్లో అనుకుంటే రకరకాల ప్రక్రియలు జరిగాయి. గత 60,70 ఏళ్లలో రెండుసార్లు కలవడం, మరో రెండుసార్లు విడిపోవడానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరనేది వేరే ప్రశ్న. అవన్నీ గ్రంథస్తం కావా లి. ఎప్పటికయినా మనుషులు తెలివి తెచ్చుకుని పొరబాట్లు మళ్లీ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా’ అని చలమేశ్వర్ అన్నారు. ఏదీ సవ్యంగా జరగలేదు... సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా ఏదీ సవ్యంగా జరగలేదని, దీనికి నెహ్రూ మొదలు కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందరూ బాధ్యులేనన్నారు. ‘ఏమైనా, విభజన జరిగింది. ఇది కొంతమందికి నచ్చలేదు. కానీ చేయగలిగిందేమీ లేదు. అయినా బిల్లు పాస్ కాలేదనే వాళ్లు కొందరున్నారు. వాళ్లలో ఉండవల్లి ఒకరు.’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని చాలా అంశాలను సాక్షి సీరియల్‌గా ప్రచురించిందని వివరించారు.రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణపై ఆధిపత్యం కోసమో, పదవుల కోసమో సమైక్యాంధ్ర కోసం పోరాడలేదని, ఉమ్మడిగా ఉంటే మరింత అభివృద్ధి, మేలు జరుగుతుందని పోరాడామన్నారు. గ్రంథ రచయిత ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన ప్రక్రియ ఆ విధంగా జరగలేదన్నదే తన ఆవేదన అని చెప్పారు. అధికార, ప్రతిపక్షం కలిస్తే ఏమైనా చేయవచ్చన్నది ఈ బిల్లుతో నిరూపణ అయిందని వివరించారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకుడు డి.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాసరెడ్డి, డి.అమర్, కృష్ణారావు, బి.శ్రీనివాసరావు, మాజీ ఐఎఎస్ అధికారులు మోహన్‌కందా, పీవీకే ప్రసాద్, మాజీ డీజీపీ అరవిందరావు, తెలంగాణ సీఎం మీడియా సలహాదారు జ్వాలా నరసింహారావు, ఎమెస్కో ప్రచురణాలయం అధిపతి విజయ్‌కుమార్‌లు ప్రసంగించారు. మరో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ప్రసంగించేందుకు నిరాకరించారు. -
ప్రకంపనలు రేపుతున్న కొలీజియం
-
జస్టిస్ చలమేశ్వర్‌కు కట్జూ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం, బదిలీలలో కీలక పాత్ర పోషించే కొలీజియం సమావేశానికి సైద్ధాంతికపరమైన నిర్ణయంతో గైర్హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్‌కు మద్దతు పెరుగుతోంది. చలమేశ్వర్ నిర్ణయానికి ఇప్పటికే ముగ్గురు మాజీ సీజేలు మద్దతుతెలుపగా ఆదివారం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సామాజిక మాధ్యమంలో అభినందించారు. ‘హ్యాట్స్ఆఫ్ టు జస్టిస్ చలమేశ్వర్ ఫర్ హిజ్ ప్రిన్సిపుల్డ్ స్టాండ్’ అని జస్టిస్ కట్జూ ట్వీట్ చేశారు. లాంఛనంగా కొలీజియం సమావేశం ప్రారంభం కావడానికి ముందుగానే ‘నా అభ్యర్థికి నువ్వు మద్దతివ్వు, నీ అభ్యర్థికి నేను మద్దతిస్తాను’ అనే విధంగా కొలీజియం సభ్యులు ఒక నిర్ణయానికి వస్తారని జస్టిస్ మార్కండేయ కట్జూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపికకు ఇది సరైన విధానమా అని ప్రశ్నించారు. ప్రతిభ కు ఏమౌతుందన్నారు. ఆశ్చర్యం లేదనీ, పలువురు అర్హత లేని వారు ఎంపికయ్యారని జస్టిస్ కట్జూ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుందని జస్టిస్ కట్జూ చెప్పారు. పారదర్శకత ఉంటేనే హాజరవుతా... జవాబుదారీతనం, పార దర్శకత ఉంటేనే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం సమావేశానికి హాజరవుతానని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన టీవీ చానెల్‌తో మాట్లాడుతూ..కొలీజియం సమావేశానికి తాను హాజరు కాకుడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని తాను బలంగా నమ్ముతానని...అందుకే ఈ ప్రయత్నమన్నారు. ఈ నిర్ణయంపై సమావేశాన్ని టాప్ ప్యానల్ మినిట్స్ బుక్‌లో రికార్డు చేయాలని ఆయన కోరారు. న్యాయమూర్తుల ఎంపికలో లేదా తిరస్కరణలో తగిన కారణాలను పేర్కొనాలని, ఈ అంశంలో సీజేఐ తగిన హామీనిస్తే సమావేశానికి తప్పకుండా హాజరవుతానన్నారు. చలమేశ్వర్ నిర్ణయం ఇతర న్యాయమూర్తులను నిరాశకు గురిచేసింది.