సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన చివరి పనిదినం నాడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ వేదిక పంచుకున్నారు. సీజేఐతో కలిసి వేదిక పంచుకోరంటూ వచ్చిన ఊహాగానాలకు ఆయన తెరదించారు. జూన్ 22న జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ చేస్తున్నప్పటికీ.. శుక్రవారమే ఆయనకు చివరి పనిదినం. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వేసవి సెలవులు. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కలసి కోర్టు నంబర్–1లో జస్టిస్ చలమేశ్వర్ కూర్చున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వారు తమ చివరి పనిదినం నాడు ప్రధాన న్యాయమూర్తితో కోర్టు నంబర్–1ను పంచుకోవడం ఆనవాయితీ.
బెంచ్‌పై ఉన్నంతసేపూ సీజేఐ జస్టిస్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ స్నేహపూర్వకంగా కనిపించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్.. తమ ముందుకొచ్చిన 11 కేసుల్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా జస్టిస్ చలమేశ్వర్‌తో చర్చించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, గోపాల్ శంకరనారాయణన్ తదితరులు వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం అందరికీ నమస్కరిస్తూ కోర్టు హాలు నుంచి సీజేఐతో కలసి జస్టిస్ చలమేశ్వర్ వెళ్లిపోయారు. 2011 అక్టోబర్ 11వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్‌లు ఇద్దరూ ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడం గమనార్హం.
నిబద్ధతలో ఆయన ‘సుప్రీం’
సంచలనాలకు కేంద్ర బిందువైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్రవేశారు. సుప్రీంకోర్టు జడ్జీగా దాదాపు ఏడేళ్లలో ఎన్నో కీలక తీర్పుల్లో ప్రధాన భాగస్వామిగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యాక ఆయన అదే కోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. 2007–11 మధ్య గువాహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబర్ 17, 2015.. ఎన్‌జేఏసీ కేసులో అసమ్మతి తీర్పు నుంచి జనవరి 12, 2018న మరో ముగ్గురు సుప్రీం జడ్జిలతో కలిసి విలేకరుల సమావేశంలో సుప్రీంలో పాలనా వ్యవహారాల్ని ప్రశ్నించే వరకూ న్యాయవ్యవస్థ గౌరవం పెరగడానికి ఆయన కృషిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై అసమ్మతి వ్యక్తంచేస్తూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జనవరి 12న చలమేశ్వర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఒక సంచలనం. కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి మిశ్రా ధోరణిని జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు కొలీజియం సభ్యులైన జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు తప్పుపట్టారు. జస్టిస్ మిశ్రాకు రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. సుప్రీం జడ్జిగా రిటైరయ్యాక తానే పదవి తీసుకోనని చలమేశ్వర్ ముందే ప్రకటించారు.
జస్టిస్ చలమేశ్వర్ చరిత్రాత్మక తీర్పులు
►జడ్జిల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం చెల్లదని అక్టోబర్ 17, 2015న ధర్మాసనంలోని నలుగురు జడ్జిలు మెజారిటీ తీర్పు ఇవ్వగా, దానిని సమర్థించిన ఏకైక జడ్జిగా చలమేశ్వర్ నిలిచారు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదని తీర్పులో విమర్శించారు.
►ఎవరికైనా ‘చికాకు లేదా ఇబ్బంది’ కలిగించే ఈ మెయిల్ సందేశాలు ఇచ్చేవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఏ సెక్షన్ చెల్లదని జస్టిస్ నారిమన్‌తో కలిసి జస్టిస్ చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు.
►ఆధార్ కార్డు లేదనే సాకుతో ఏ పౌరునికి మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్‌లతో కలిసి చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ జేజే పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు.
►అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులే కాకుండా జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడ్డవారు కూడా ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆయన తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment