ఆ్రస్టేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్; ఫ్యామిలీతో డేవిడ్ వార్నర్..
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్‌లో సస్పెన్షన్‌లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి.
సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్‌తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్‌గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు.
తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్‌లోనే కొనసాగుతాడు.
సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్‌ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ కెరీర్‌నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్‌లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు.
సఫారీతో అరంగేట్రం
దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్‌తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్‌లో 99 టి20 మ్యాచ్‌ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు.
ఇవీ విజయాలు
► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్‌నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్‌కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.
ఇవీ వివాదాలు
► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు.
► కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్‌కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment