‘‘మా దేశం తరఫున మేము ఇంతకు ముందెన్నడూ చూడని అత్యత్తుమ క్రికెటర్లలో ఒకడైన డేవిడ్ వార్నర్‌కు అభినందనలు. ప్రతి విషయంలోనూ ముందు వరుసలో కూర్చోగలిగే గౌరవం దక్కడం పట్ల గర్వంగా ఉంది.
ఇక ముందు నువ్వు ఆస్ట్రేలియా తరఫున ఆడవంటే బాధగా ఉంది. ఆసీస్ ప్లేయర్‌గా కచ్చితంగా నిన్ను మిస్సవుతాము.
అయితే, ఇకపై నీతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపవచ్చు కాబట్టి ఓ పక్క సంతోషంగానూ ఉంది. లవ్ యూ’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ వార్నర్ భావోద్వేగానికి లోనైంది.
అదే విధంగా ఆటగాడిగా తన భర్త సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ రికార్డుల విశేషాలు షేర్ చేసింది. వార్నర్‌ను విమర్శించిన వాళ్ల నోళ్లు మూతపడేలా అతడి అరుదైన ఘనతల గురించి చెబుతూ అతడి గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేసింది.
నా భర్త గొప్పదనం ఇదీ
‘‘ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్. ప్రపంచంలో మూడో వ్యక్తి.
మూడు ఫార్మాట్లలో కలిపి 49 శతకాలు సాధించిన క్రికెటర్. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్.
అంతర్జాతీయ స్థాయిలో 18995 పరుగులు చేసిన క్రికెటర్. రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్, ఒకసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.
టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన టీమ్‌లో మెంబర్. వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఘనత. మూడుసార్లు అలెన్ బోర్డర్ మెడల్ విజేత.
టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్.. ఒకవేళ ఎవరైనా మర్చిపోతారేమో.. అందుకే ఈ నిజాలు చెబుతున్నా’’ అంటూ కాండిస్ వార్నర్ ఉద్వేగపూరిత నోట్‌తో పాటు భర్త, కూతుళ్లతో కలిసి ఉన్న ఫొటోలు పంచుకుంది.
ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నం
ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారి కంగారు పెట్టించిన ఈ కంగారూ క్రికెటర్ వార్నర్ అంతర్జాతీయ ఆటకు సంపూర్ణంగా టాటా చెప్పేసిన విషయం తెలిసిందే. తాజాగా టీ20లకు గుడ్‌బై చెప్పడం ద్వారా 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు 37 ఏళ్ల వార్నర్ వీడ్కోలు పలికాడు.
ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడైన వార్నర్ ఇన్నింగ్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ తెరదించాడు. అతని చివరి ఇన్నింగ్స్ స్కోరు 6. నిరాశగా వెనుదిరగడం మినహా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ గానీ స్టాండింగ్ ఒవేషన్ గానీ అందుకోలేకపోయాడు.
అతని అంతిమ స్కోరు నిరాశపరచిందేమో కానీ... అతనే ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల (3277) వీరుడు. అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకున్న అతను చేసిందేమాత్రం తక్కువ కాదు.
టెస్టు, వన్డే, టి20లు కలిపి దాదాపు 19 వేల పరుగులు (18,995) సాధించాడు. 49 సెంచరీలు బాదాడు. 98 అర్ధశతకాలు చేశాడు. సొంతగడ్డపై 2009 జనవరిలో సఫారీతో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
అదే నెల అదే ప్రత్యర్థిపై వన్డే కెరీర్ మొదలుపెట్టాడు. కానీ ఈ విధ్వంసకారుడు సంప్రదాయ టెస్టులు ఆడేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. 2011 డిసెంబర్‌లో కివీస్‌పై ఐదు రోజుల ఆటకు శ్రీకారం చుట్టాడు.
ముగింపు ఇలా...
ఓపెనర్‌గా విజయవంతమైన వార్నర్ ఆట భారత్‌తోనే ముగిసింది. గత నవంబర్లో భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్‌పై ఆడాకా ఆసీస్ విజేతగా నిలువడంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో సూపర్–8 దశలో భారత్‌తోనే (మొత్తం అంతర్జాతీయ) కెరీర్‌కు మంగళం పాడాడు.
మరక పడిందలా...
ఆటలో మేటి, ఓపెనింగ్‌లో ఘనాపాటి. మైదానంలో చిన్నచిన్న స్లెడ్జింగ్ ఉండేదేమో కానీ బాల్ టాపంరింగ్ కంటే ముందు వార్నర్ పక్కా జెంటిల్‌మేనే!
2018లో సఫారీ పర్యటనలో మూడో టెస్టు (కేప్‌టౌన్‌లో) సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్, కెప్టెన్ స్మిత్, బౌలర్ బ్యాంక్రాఫ్ట్‌తో కలిసి బాల్ టాంపరింగ్ (బంతి ఆకారం మార్చడం)కు పాల్పడంతో ఏడాది పాటు నిషేధానికి, కెరీర్ అసాంతం కెప్టెన్సీకి దూరమయ్యాడు.
👉ఆడిన టెస్టులు: 112
👉చేసిన పరుగులు: 8786
👉సెంచరీలు: 26
👉అర్ధ సెంచరీలు: 37
👉అత్యధిక స్కోరు: 335 నాటౌట్
👉ఆడిన వన్డేలు: 161
👉చేసిన పరుగులు: 6932
👉సెంచరీలు: 22
👉అర్ధ సెంచరీలు: 33
👉అత్యధిక స్కోరు: 179
👉ఆడిన టీ20లు: 110
👉చేసిన పరుగులు: 3277
👉సెంచరీలు: 1
👉అర్ధ సెంచరీలు: 28
👉అత్యధిక స్కోరు: 100 నాటౌట్ .
Comments
Please login to add a commentAdd a comment