టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 24) భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం జరుగనుంది. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సెయింట్ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ రద్దైతే ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.
ఇలా జరిగితే మాత్రం భారత్ ఇంటికే..
ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నా సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారతపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్ఘనిస్తాన్ 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment