
జస్టిస్ చలమేశ్వర్‌కు కట్జూ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం, బదిలీలలో కీలక పాత్ర పోషించే కొలీజియం సమావేశానికి సైద్ధాంతికపరమైన నిర్ణయంతో గైర్హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్‌కు మద్దతు పెరుగుతోంది. చలమేశ్వర్ నిర్ణయానికి ఇప్పటికే ముగ్గురు మాజీ సీజేలు మద్దతుతెలుపగా ఆదివారం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సామాజిక మాధ్యమంలో అభినందించారు. ‘హ్యాట్స్‌ఆఫ్ టు జస్టిస్ చలమేశ్వర్ ఫర్ హిజ్ ప్రిన్సిపుల్డ్ స్టాండ్’ అని జస్టిస్ కట్జూ ట్వీట్ చేశారు.
లాంఛనంగా కొలీజియం సమావేశం ప్రారంభం కావడానికి ముందుగానే ‘నా అభ్యర్థికి నువ్వు మద్దతివ్వు, నీ అభ్యర్థికి నేను మద్దతిస్తాను’ అనే విధంగా కొలీజియం సభ్యులు ఒక నిర్ణయానికి వస్తారని జస్టిస్ మార్కండేయ కట్జూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపికకు ఇది సరైన విధానమా అని ప్రశ్నించారు. ప్రతిభ కు ఏమౌతుందన్నారు. ఆశ్చర్యం లేదనీ, పలువురు అర్హత లేని వారు ఎంపికయ్యారని జస్టిస్ కట్జూ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుందని జస్టిస్ కట్జూ చెప్పారు.
పారదర్శకత ఉంటేనే హాజరవుతా...
జవాబుదారీతనం, పార దర్శకత ఉంటేనే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం సమావేశానికి హాజరవుతానని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన టీవీ చానెల్‌తో మాట్లాడుతూ..కొలీజియం సమావేశానికి తాను హాజరు కాకుడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని తాను బలంగా నమ్ముతానని...అందుకే ఈ ప్రయత్నమన్నారు. ఈ నిర్ణయంపై సమావేశాన్ని టాప్ ప్యానల్ మినిట్స్ బుక్‌లో రికార్డు చేయాలని ఆయన కోరారు. న్యాయమూర్తుల ఎంపికలో లేదా తిరస్కరణలో తగిన కారణాలను పేర్కొనాలని, ఈ అంశంలో సీజేఐ తగిన హామీనిస్తే సమావేశానికి తప్పకుండా హాజరవుతానన్నారు. చలమేశ్వర్ నిర్ణయం ఇతర న్యాయమూర్తులను నిరాశకు గురిచేసింది.