ఐఏఎస్‌ల రోస్టర్‌పై నేడు డ్రా | Today will make draw on roster policy on IAS distribution | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ల రోస్టర్‌పై నేడు డ్రా

Published Sat, Aug 16 2014 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Today will make draw on roster policy on IAS distribution

* ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించాలో తేల్చనున్న ప్రత్యూష్ సిన్హా కమిటీ
* రోస్టర్ అనివార్యమైన అధికారుల్లో టెన్షన్

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించి రోస్టర్ విధానం ఏ రాష్ర్టం నుంచి ప్రారంభించాలనే అంశంపై శనివారం ఢిల్లీలో జరిగే సమావేశంలో డ్రా తీయనున్నారు. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు ఐఏఎస్‌ల సంఘం కార్యదర్శి రేమండ్ పీటర్, ఐఎఫ్‌ఎస్‌ల సంఘం నుంచి చోట్రాయ్, ఐపీఎస్‌ల సంఘం నుంచి మాలకొండయ్య పాల్గొననున్నారు. డ్రా అనంతరం నిబంధనల మేరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీకి వారంరోజుల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అరుుతే ఇప్పటివరకు పంపకం ఎప్పుడు జరుగుతుందా..? అని ఎదురు చూసిన ఐపీఎస్ అధికారుల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏపీకే చెందినవారై, రోస్టర్ విధానం అనివార్యమైన అధికారులతో పాటు రోస్టర్ విధానమే శరణ్యమైన రాష్ట్రేతరుల్లోనూ టెన్షన్ నెలకొని ఉంది. కమిటీ చేపట్టే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీ, తెలంగాణల నుంచి ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందం వెళ్తోంది.
 
 అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియను మొదలుపెట్టిన  సిన్హా కమిటీ మేలో ఐపీఎస్‌ల నుంచి ఆప్షన్లతో పాటు ఎక్కడకు కేటాయిస్తే అక్కడకు వెళ్తామంటూ హామీ పత్రాన్ని కూడా తీసుకుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ ఏడాది మేలోనే ఏపీకి 144 ఐపీఎస్ పోస్టులు కేటాయించింది. ఐపీఎస్ పోస్టుల భర్తీ రెండు రకాలుగా జరుగుతుంది. యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఎంపికయ్యే వారిని డెరైక్ట్ రిక్రూటీలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డీఎస్పీగా ఎంపికై, నిర్ణీత సర్వీసు పూర్తి చేసుకున్న తరవాత ఐపీఎస్ హోదా పొందే వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పరిగణిస్తారు. సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో ప్రతి 100 పోస్టులకు 67 మంది డెరైక్ట్ రిక్రూటీలు, 33 మంది కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఉండాలి.
 
  ఈ లెక్క ప్రకారం సీమాంధ్రకు 101 డెరైక్ట్ రిక్రూట్, 43 కన్ఫర్డ్ పోస్టులు, తెలంగాణకు 78, 34 చొప్పున కేటాయించారు. 67% డెరైక్ట్ ఐపీఎస్ పోస్టుల్లోనూ 2/3 వంతు బయటి రాష్ట్రాలకు చెందిన వారు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉండాలి. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటే డిప్యుటేషన్లపై ఆ లోటును పూడుస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులైన కన్ఫర్డ్, డెరైక్ట్ ఐపీఎస్‌ల సంఖ్య నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో అదనంగా ఉన్న ఈ అధికారుల్ని రోస్టర్ పద్దతిలో రెండు రాష్ట్రాలకూ పంచాల్సిన అవసరం ఏర్పడింది. సీనియర్లను మినహారుుంచి అత్యంత జూనియర్లను ఈ జాబితాలోకి తీసుకుంటారు. వీరికి తోడు రాష్ట్రేతర అధికారుల్నీ ఈ విధానంలోనే పంచనున్నారు. ప్రస్తుతం కీలక పోస్టుల్లో పని చేస్తున్న టీపీ దాస్, ఏఆర్ అనురాధ, ఆర్పీ ఠాకూర్, వీఎస్‌కే కౌముది, హరీష్‌కుమార్ గుప్తా తదితరులంతా ఏపీ రాష్ట్రేతరులే. అయితే వీరిలో అనురాధ మాత్రమే పూర్తి సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఆమె రోస్టర్ ప్రకారం ఏ రాష్ట్రానికి వెళ్లినా... భర్త సురేంద్రబాబు రాష్ట్రానికే చెందిన అదనపు డీజీ కావడంతో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధ కేటాయింపునకు ఢోకా లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ఏపీ డీజీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి భద్రతల విభాగం ఐజీ హరీష్‌కుమార్ గుప్తా ఇతర సిబ్బందితో కలిసి జెండాను ఎగుర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement