సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విచారణ కొత్త ధర్మాసనానికి కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణకు అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఏర్పాటయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉదయ్ లలిత్, జస్టిస్ చందర్ చూడ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆయోధ్య కేసును ఈ నెల 10న విచారణ చేపట్టనుంది.
అయోధ్య–బాబ్రీ వివాదమేంటి?
భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు.
రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment